భారతదేశ జనాభాలో మెజార్టీ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించేవారే ఎక్కువమంది ఉంటారు. వ్యవసాయాన్ని ఒక సాంప్రదాయ వృత్తిగా భారతీయులు భావిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వ్యవసాయాన్ని వదులుకోరు. అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తారు. ప్రపంచీకరణ, ఆధునీకత పెరుగుతున్న నేపథ్యంలో పల్లెలు పట్టాణాలుగా మారిన వ్యవసాయం అనేది కొనసాగుతూనే ఉంది. యువత కూడా జాబ్ లు వదిలేసి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న కథలు కూడా మనం రోజూ ఎక్కడో ఒకచోట వింటున్నాం.
అయితే వ్యవసాయం చేయాలంటే బోల్డెంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వేలల్లో, లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వ్యవసాయం చేయాలంటే భారంతో కూడుకున్న పని. లాభాలు వస్తే పెట్టుబడి పెట్టిన కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ ఆకాల వర్షాలు, వరదలు, తెగుల వల్ల పంట నష్టపోతే రైతులకు ఇక అప్పులే మిగులుతాయి. అయినా సరే రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడరు.
వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్ అవసరం చాలా ఉంటుంది. పోలం దున్నడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత పంటను ఇంటికి తీసుకెళ్లడానికి వరకు ట్రాక్టర్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ట్రాక్టర్ కిరాయికి చాలా ఖర్చు అవుతుంది. ఒకప్పుడు ఎద్దులతో ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్లు. పోలాన్ని దున్నడానికి, చదును చేయడానికి, విత్తనాలు వేయడానికి.. ఇలా ప్రతిదానికి ఎద్దులను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు ఎద్దులను కొనుగోలు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇక విత్తనాలు, కూలీల ఖర్చులు, ఎరువులు, మందుల ఖర్చులన్నీ చూస్తే పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది.
ట్రాక్టర్ కు కిరాయి ఇవ్వలేక, ఎద్దులను కొనుగోలు చేసేంత స్తోమత లేక దున్నపోతుతో ఒక యువ రైతు వ్యవసాయం చేస్తున్న ఘటన ఆసక్తిని కలిగిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కస్లాగూడ గ్రామానికి చెందిన మిర్జా యూసుఫ్ బేగ్ అనే రైతుకు ఐదెకరాల స్థలం ఉంది. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా.. ఒక ఎకరంలో చెరుకు సాగు చేస్తున్నాడు.
గత నెలలో నాలుగు ఎకరాల్లో పత్తి నాటాడు. పోలంలో కలుపు తీయడానికి ఎద్దులు లేక తనకు ఉన్న దున్నపోతుతోనే ఆ పని చేస్తున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ డౌర కొట్టే పరికరాన్ని తయారు చేయించాడు. దున్న ముక్కుకు మూకుతాడు బిగించి డౌరను దున్న మెడకు బిగించాడు. డౌర కొడుతూ కలుపు తీయిస్తున్నాడు. దీని కోసం దున్నకు ప్రత్యేకంగా ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చినట్లు యవ రైతు యూసుఫ్ బేగ్ తెలిపాడు.
దీని వల్ల తనకు ఖర్చులు చాలా తగ్గుతున్నాయని, దున్న తనకు ఇలా ఉపయోగపడుతుందని చెప్పాడు. ట్రాక్టర్ తో వ్యవసాయం చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని, ఎద్దులు కొనడానికి రూ.90 వేల వరకు ఖర్చు అవుతుందన్నాడు. అంత స్తోమత తనకు లేదని, అందుకే దున్నపోతుతో వ్యవసాయం చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇది చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Share your comments