రాష్ట్రంలో వానకాలం (ఖరీఫ్) సీజన్ కోసం రైతు బంధు ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లో జమ కావడం ప్రారంభమయ్యి మూడు రోజులు పూర్తయ్యాయి. 3వ రోజు నాటికీ తెలంగాణ లోని నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మూడెకరాల లోపు ఉన్న 7.40లక్షల మంది రైతులకు రూ.491.79 కోట్లు జమ అయ్యాయి.
రైతుబంధు లబ్ధిదారుల సంఖ్యా ప్రతి ఏటా పెరుగుతూనే వస్తుంది.రాష్ట్రంలోనే రైతుబంధు పథకం మొదలైన నాటి నుంచి అత్యధిక ప్రయోజనం పొందుతున్నది నల్లగొండ జిల్లానే. వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా రైతులకు సుమారు 1300 కోట్ల రూపాయలు పెట్టుబడిసాయంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల నుంచి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నెల 26 నుంచి మొదలు కాగా బుధవారం నాటికి మూడెకరాల లోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడ్డాయి. మూడెకరాల లోపు విస్తీర్ణానికి సంబంధించి నల్లగొండ జిల్లాలో 84,583 మంది రైతులకు రూ.103.63 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 44,412 మంది రైతులకు రూ.54.30 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 37,837 మంది రైతులకు రూ.45.97 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి.
మూడు రోజుల్లో కలిపి నల్లగొండ జిల్లాలో 3,60,304 మంది రైతులకు గానూ 4,89,596 ఎకరాలకు సంబంధించి రూ.244.79కోట్లు పెట్టుబడి సాయంగా అందాయి. సూర్యాపేట జిల్లాలో 2,05,589 మంది రైతులకు 2,72,876 ఎకరాలకు సంబంధించిన రూ.136.43 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,74,141 మంది రైతులకు గానూ 2,21,157 ఎకరాలకు సంబంధించి రూ.110.57 కోట్లు రైతులకు పెట్టుబడి సాయంగా అందాయి. గురువారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు పెట్టుబడిసాయం అందనుంది. ఇలా పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ వానకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత సీజన్ కంటే అదనంగా ఈ సారి మరింత ఎక్కువ మందికి రైతుబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
ఇది కూడా చదవండి
Share your comments