ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో శుక్రవారం కురిసిన గాలివానతో మామిడి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గాలివానకు వేలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 45 వేల ఎకరాల్లో రైతులు మామిడిని సాగు చేస్తున్నారు. ఇప్పటికే చెట్లకు తామర పురుగుతో పాటు వివిధ తెగుళ్లు సోకడంతో పూత, కాత దశల పై తీవ్ర ప్రభావం పడింది. ధైర్యం కోల్పోకుండా రైతులు పెట్టుబడి పెట్టి చెట్లకు మందుల పిచికారీ చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడడంతో మామిడి కాయలు నేల రాలాయి.
సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. అయితే తామర పురుగు, తెగుళ్లు సోకడంతో కనీసం 4 నుండి 5 టన్నుల దిగుబడి అయిన వస్తుందని ఆశించామని పేర్కొన్నారు. ఈదురుగాలుల బీభత్సంతో ఇప్పడు రెండు టన్నుల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రస్తుతం చెట్లకు 30 శాతం కాయలే ఉన్నాయని చెప్పారు. నెల క్రితం వరకు టన్ను మామిడి ధర రూ. 45 వేల నుంచి రూ. 50 వరకు ఉన్నదని, ప్రస్తుతం రూ. 22 వేలకు టన్ను మామిడి ధర పడిపోయిందని వాపోతున్నారు. గాలివానల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
పెరిగిన వేరుశెనగ ధర క్వింటాకు రూ.7,370..
మరోవైపు శుక్రవారం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలను పెనుబల్లి మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఇంకోవైపు క్షేత్ర స్థాయిలో దెబ్బ తిన్న పంటల పై అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్... దెబ్బ తిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అయిన మామిడి రైతులకు ఆసరా అవుతుందో చూడాలి.
Share your comments