రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభించి నేటికి సరిగ్గా రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా దీనిపై ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించామని, రైతుల కృషి, పట్టుదల ఎంతో స్ఫూర్తిమంతమన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, నిరంతరం దానిపై పనిచేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు గత 7 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, చరిత్రలో లేని విధంగా రైతుల పంటలకు మద్దతు ధరలను పెంచిందని మోదీ చెప్పారు.
కాగా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా వీటిని ఇస్తోంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేస్తోంది. ఈ పథకం వల్ల లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ ఆర్థిక సహాయంను రూ.10 వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
Share your comments