News

టమాటా రైతులకి ఇక పండగే! 6 నెలల్లో కర్నూలు లో ఆ పనులు మొదలు…

KJ Staff
KJ Staff

రానున్న ఆరు నెలల్లో ఒక పూర్తి స్థాయి టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను కర్నూలులో అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర  పరిశ్రమల, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. టమాటా సాగు అధికంగా జరిగే కర్నూలు జిల్లా లో, మార్కెటింగ్ ఆటు పోట్ల వల్ల రైతులు అమితంగా నష్టపోతున్నారు. ఇలా బజారులో తరచుగా ధరలు పడిపోవడం, భారీ నష్టాలు రావడం  సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. తమ కాయ కష్టంతో టమోటాలు సాగు చేసే రైతులకు కనీస గిట్టుబాటు ధరలు కలిగించాలని భావించి ప్రభుత్వం జిల్లాలో ఈ టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది.

సుమారు ఎనిమిది వేల హెక్టార్లలో జరుగుతున్న టమోటా పంట సాగు, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చేస్తుండగా అందులో, సగానికిపైగా పత్తికొండ నియోజకవర్గంలోనే పండుతోంది. తరచుగా పడిపోయే ధరలు, సరిపోని గిట్టుబాటు ధరలు, వీటివల్ల రైతులు టమోటాను రోడ్లపైనే పారబోయడం ఒక మామూలు విషయం అయిపొయింది. ఎన్నోసార్లు కనీసం చార్జీలకు రవాణా ఛార్జీలకు డబ్బులు లేక మిగిలిపోయిన టమోటాలని కుప్పగా పారేయడం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇందుకోసమే పత్తికొండ నియోజకవర్గంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసి వ్యవసాయదారులని ఆదుకోవాలని కొన్ని సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ కోరికలు విని పలుమార్లు భూమిపూజ చేసినా కార్యాచరణకు మాత్రం పూనుకోలేదు.

అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని అమలుచేసే ప్రయత్నంలోనే పత్తికొండ మండలం కనకదిన్నె సమీపంలో మంత్రి టీజీ భరత్‌, పలు ముఖ్యుల ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. ఈ యూనిట్‌ను 6 నెలల్లో పూర్తిచేస్తామని మంత్రి భరత్‌ తీర్మానించారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించనున్నఈ యూనిట్‌ ద్వారా టమోటా రైతుల సమస్యలన్నింటికీ పరిష్కారం దక్కుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించిన రాయితీలను కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందన్నారు. ఈ అంశం పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ఫుడ్ ప్రాసెసింగ్ అంశం‌పై మాట్లాడుతూ, రానున్న ఐదు ఏళ్లలో 30 వేల కోట్ల పెట్టుబడులు ఈ రంగం ద్వారా రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకనే టార్గెట్ పెట్టుకొని మరి కష్టపడుతున్నట్లు వివరించారు.

ఈ యూనిట్ ఏర్పడిన తర్వాత టొమాటో‌లు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఎక్కడా ఉండదన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా మంది ఈ యూనిట్‌లు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. ఈ  టమోటా ప్రాసెస్‌ యూనిట్‌ ఏర్పాటు వల్ల పత్తికొండతోపాటు రైతుల దశాబ్దాల కల సాకారం అవుతుండటంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా మంత్రి టి జి భరత్ మాట్లాడుతూ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎంఎల్ఏలలు కోరారని, వెంటనే అందుకు సంబంధించిన పనులు శీఘ్రతరం చెయ్యాలని, ఆదేశాలు వచ్చాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కొరకు రాష్ట్ర నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇంకా మాట్లాడుతూ, పత్తికొండ ప్రాంతంలో టొమాటో పంట వ్యవసాయం చాలా ఎక్కువగా జరుగుతుంది అని అన్నారు. అదే విధంగా తుగ్గలి, దేవనకొండ, కృష్ణగిరి, ఆదోని, గొనేగండ్ల, ఆస్పరి, ఆలూరు ప్రాంతాల వారికి ఈ యూనిట్ ఒక ఆసరా అవుతుందని అన్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More