
దేశంలో ఎవ్వరు చెయ్యనట్లుగా, అధికారంలోకి వచ్చిన పది నెలలోనే రైతులకి రికార్డు స్థాయిలో రుణమాఫీ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటేసారి 25.35 లక్షల రైతులకి రుణమాఫీ చేసి చరిత్రలోకి కాంగ్రెస్ ప్రభత్వం ఎక్కిందని కొనియాడారు.
పూర్తిగా 20,616 కోట్ల రూపాయలతో 2 లక్షలలోపు అప్పులు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మండలిలో అడిగిన ప్రశ్నకి జవ్వాబు ఇస్తూ ఈ సమాధానాన్ని ఇచ్చారు. అంతే కాకుండా రైతుభరోసా తో పెట్టుబడి సహాయాన్ని 12 వేలు చేశామని, పూర్వ ప్రభుత్వం 10 వేలు మాత్రమే ఇచ్చేదని వివరించారు. ఇప్పటిదాకా 4,166 కోట్ల రూపాయిలు రైతుల సహాయం కోసం విడుదల చేసారని, ఆ సహాయ లబ్దిని సుమారు 52 లక్షల మంది పొందారని పేర్కొన్నారు. ఇదే విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, రైతు ఆత్మహత్యలకి ముఖ్య కారణం రుణాలే అని అన్నారు. పెద్ద పెద్దోళ్ళు కోట్లల్లో అప్పులు చేసి తిరుగుతుంటే రైతులు మాత్రం 50 వేలు లక్ష అప్పుకు, అప్పు ఇచ్చిన వాళ్ళ నుండి వచ్చే అవమానాలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. అందుకనే తమ ప్రభత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేశామని, ఇదొక చారిత్రాత్మక ఘట్టమని నొక్కి చెప్పారు.
ప్రస్తుతం రైతు భరోసా ద్వారా మెరుగైన విత్తనాలు, ఎరువులు మరియు నీటిపారుదలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అర్హతగల రైతులకు ఏటా ఎకరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పటిదాకా నాలుగు విడతల్లో రైతు భరోసాని మూడు లేదా అంతకంటే తక్కువ ఎకరాలు ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే పెట్టుబడి సాయం కింద వర్తింపజేసింది. ఇప్పుడు 4 ఎకరాల భూమి కలిగిన రైతులకు కూడా ఈ సాయం అందింది. మరో ఒకటి రెండు వారాల్లో 5 ఎకరాలు ఉన్న రైతులకు, మార్చి 31లోగాఅమలు చేసేటందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రకారం సీజనుకి 6 వేల రూపాయిలు రైతుల ఖాతాలో పడతాయి.
Share your comments