సాధారణంగా మనం తోటలలో పెంచుకొనే వివిధ రకాల పండ్ల చెట్లు వయస్సు పెరిగిపోతే వాటిలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దిగుబడి తక్కువగా ఉన్న చెట్లను మనం నరికి వేయడం సర్వసాధారణం. ఈ విధంగానే కృష్ణాజిల్లా ఈడుపుగల్లు లోని ఉపాధ్యాయుడు పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 45 సంవత్సరాల మామిడి చెట్టు కొమ్మలను నరికి వేశారు.
వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి దేశవాలి మామిడి చెట్లను కొంతకాలం క్రితం నరికేసిన కొమ్మలలో అద్భుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం నరికిన ఆ కొమ్మలకు గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది కూడా కొన్ని కొమ్మలను కత్తిరించడంతో కత్తిరించిన కొమ్మలకు విపరీతంగా కాయలు కాస్తాయి. ఈ సందర్భంగా వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ విధమైనటువంటి సేంద్రియ రసాయనిక ఎరువులను మామిడి చెట్టుకు వేయడం లేదని కేవలం నీటిని మాత్రమే పెడుతున్నట్లు తెలిపారు.
ఈ విధంగా నరికిన కొమ్మకు కాయలు కాస్తున్న విషయాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. టి. జానకిరాం తదితర ఉద్యాన శాస్త్రవేత్తలు ఇటీవల ఈ దేశవాళీ మామిడి చెట్లను సందర్శించి రైతును ప్రశంసించారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ మేలైన రకం వంగడాల అభివృద్ధి కోసం జరిపే పరిశోధనలలో ఈ మామిడి చెట్టు జన్యు వనరును ఉపయోగిస్తామని తెలిపారు.
Share your comments