గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు వచ్చే నెల 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మూడు చట్టాలు అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 25నాటికి ఏడాది నిండుతుంది. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి మూలకు రైతు ఉద్యమాన్ని విస్తరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) జాతీయ కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. అలాగే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది.
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన చారిత్రాత్మక రైతు ఉద్యమం తొమ్మిది నెలలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఎస్‌కెఎం నిర్వహించిన జాతీయ కన్వెన్షన్ శుక్రవారం ముగిసింది.
ఈ సదస్సుకు కన్వీనర్‌గా ఆశిశ్ మిట్టల్ బాధ్యతలు చేపట్టారు.ఈ సదస్సులో 22 రాష్ట్రాల నుంచి కనీసం 300 రైతు సంఘాలు పాల్గొన్నాయి.వీరితోపాటు మహిళలు, కార్మికులు, గిరిజనులు, యువత కోసం పనిచేసే సంఘాల నేతలూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా రైతుల డిమాండ్ డిమాండ్లు, ప్రజల డిమాండ్లపై తీర్మానాలను కన్వెన్షన్ ఆమోదించింది.దీంతో పాటు భవిష్యత్ కార్యచరణను ప్రకటించి సెప్టెంబర్ 25న భారత్ బంద్ నిర్వహించాలని పిలుపిస్తూ తీర్మానాన్ని కన్వెన్షన్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పేర్కొంది.
ఈ చారిత్రాత్మక రైతుల పోరాటం, కేవలం రైతుల మనుగడ కోసం మాత్రమే కాదని, ఇది దేశాన్ని పూర్తిగా దేశీయ, విదేశీ కార్పొరేట్లు స్వాధీనం చేసుకోకుండా కాపాడటానికి ఉపయోగపడుతుందని కన్వెన్షన్ స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా,మోడీ ప్రభుత్వం నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పటికీ తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుందని కన్వెన్షన్ నొక్కి చెప్పింది. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎస్‌కెఎం యూనిట్లను ఏర్పాట్లు చేసి, కన్వెన్షన్లను ఏర్పాటు చేయాలని పిలుపు ఇచ్చింది. రాష్ట్ర, జిల్లా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించింది.
Share your comments