తెలంగాణ రైతులకు శుభవార్త. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వం ఇవాళ నాలుగో విడత రైతుబంధు డబ్బులను జమ చేయనుంది. వీటిని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనుంది. ఇవాళ 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1153.50 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ విడతలో నల్గొండ జిల్లాకు చెందిన రైతులు ఎక్కువమంది ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 53,381 మంది రైతులకు సంబంధించిన 1,82,542 ఎకరాలకు రూ.91.27 కోట్లు జమ కానున్నాయి.
ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన 2,300 మంది రైతులకు సంబంధించి 7,212 ఎకరాలకు రూ.36.05 లక్షలు ఇవాళ ప్రభుత్వం జమ చేయనుంది. విడతల వారీగా ఈ డబ్బులు అందిస్తుండగా.. మూడు రోజుల్లో 42.43 లక్షల మంది రైతులకు సంబంధించిన 58.85 లక్షల ఎకరాలకు రూ.5 వేల చొప్పున అందించారు.
రైతుబంధు డబ్బులు సకాలంలో అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు విడతలు కలిపి మొత్తం రూ.4095.77 కోట్లను ప్రభుత్వం రైతుబంధు క్రింద అందించనుంది. కాగా, రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఏడాది ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు విడతల్లో రూ.10 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.
రైతుబంధు డబ్బులు అకౌంట్లోకి వచ్చాయా? లేదా? తెలుసుకోండిలా?
-https://treasury.telangana.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
-ఆ తర్వాత అక్కడ మెనూ బార్‌లో ఉండే రైతుబంధు స్కీమ్ రబీ డీటైల్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
-ఆ తర్వాత సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయాలి
-ఆ తర్వాత స్కీమ్ వైజ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి మీ వివరాలు, సంవత్సరం, పీపీబీ నెంబర్ ఇవ్వాలి.
-అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయో.. లేదో తెలుస్తుంది
ఇలా కూడా తెలుసుకోవచ్చు
-https://ifmis.telangana.gov.in/login వెబ్ సైట్‌కు వెళ్లండి
-అక్కడ సంవత్సరం, రకం, పీపీబీ నెంబర్ సెలక్ట్ చేయండి
-అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
-http://rythubandhu.telangana.gov.in/Default.aspxవెబ్ సైట్‌కి వెళ్లండి
-ఆ తర్వాత రైతుబంధు స్కీమ్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మరో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది
-అందులో క్రింద కనిపించే చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ జిల్లా మండలం సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది
-అందులో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోండి
రైతుబంధు డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండి, మీ అకౌంట్‌లో రైతుబంధు డబ్బులు జమ కాకపోతే వ్యవసాయ విస్తరణాధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.వ్యవసాయ అధికారి చెక్ చేసి మీకు ఎందుకు రాలేదో తెలియజేస్తారు ఆ సూచనలు పాటిస్తే మీకు రైతుబంధు డబ్బులు జమ అవుతాయి.
అకౌంట్ వివరాలు, చెక్ బుక్ వివరాలు వ్యవసాయ అధికారులకు అందించకపోతే రైతుబంధు డబ్బులు జమ కావు. గతంలో కూడా చాలామంది బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించలేదు. అందుకే రైతులు సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలను అధికారులకు అందించాలి.
Share your comments