రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను ప్రారంభించడమే కాకుండా రైతులకు పంట రుణాలతోపాటు అనుబంధ రంగాలైన ఉద్యానం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలో అర్హులైన వారందరికీ విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ప్రోత్సహించడమే కాకుండా రుణాలు పొందే రైతులకు వడ్డీ రాయితీ కల్పించి వివిధ రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు 19 వేల కోట్లు రూపాయలు కేటాయించారు. గతేడాదితో పోల్చితే 3వేల కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది.ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లకు రూ.15వేల కోట్లను పంట రుణాలుగా అందిస్తారు, సాగు యంత్రాలు, పనిముట్ల కొనుగోలు, సూక్ష్మసేద్యం, పండ్ల తోటల సాగుకు రూ.4వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది వాస్తవ సాగు వ్యయానికి అనుగుణంగా పంట రుణ పరిమితిని నిర్ణయించారు. పంట రుణాలను సరైన సమయంలో చెల్లిస్తే లక్ష వరకు వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాడి రైతులు, మత్స్యకారులకు 20,535 మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 13 బ్యాంకుల పరిధిలో ఎవరెవరు ఎన్ని కార్డులు మంజూరు చేయాలో ప్రణాళిక రూపొందించి, దాదాపు 13వేల మంది పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తారు. అలాగే 7వేల మంది మత్స్యకారులకు మత్స్యకిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తారు. అలాగే రాష్ట్రంలోని 70400 మంది కౌలుదారులకు రూ.600 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు, ఇప్పటికే రూ.50 కోట్ల రుణాలను అర్హులైన కౌలుదారులకు అందించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.ఇప్పటికే 500 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు
త్వరలోనే మిగిలిన రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Share your comments