కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నాలుగు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో దేశ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఎండ, చలి, వాన అనేది పట్టించుకోకుండా రోడ్ల మీద కూర్చోని నిరసనలు చేపడుతున్నారు. దేశ రాజధానికి వచ్చే రహదారులన్నీ ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. కొద్దిరోజుల పాటు ఈ ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. పలుచోట్ల ఈ ఆందోళనలు ఉద్రికత్తలకు దారితీశాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం, ఎర్రకోటపై జెండా ఎగురువేయడం రచ్చకు దారితీయడంతో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనంతరం ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టగా.. ప్రశాంత వాతావరణంలో రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు.
రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాన్య ప్రజలు, సినీ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. దాదాపు బాలీవుడ్ సెలబ్రెటీలందరూ రైతుల ఉద్యమానికి మద్దతు తెలపగా... కొంతమంది సినీ సెలబ్రెటీలు స్వయంగా రైతుల ఆందోళనలలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇక అంతర్జాతీయంగా కూడా పలువురు సినీ సెలబ్రెటీలు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.
భారత్ బంద్ ఎందుకు?
ఈ ఉద్యమం చేపట్టి నాలుగు నెలలు అయిన సందర్బంగా.. ఉద్యమ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు రైతులు మళ్లీ భారత్ బంద్‌కి పిలుపునిచ్చారు. ఈ నెల 26న భారత్ బంద్‌కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యమం చేపట్టి నాలుగు నెలలైన సందర్భంగా భారత్ బంద్ చేపడుతున్నామని, అందరూ మద్దతివ్వాలని కోరారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శాంతియుతంగా బంద్ కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు. ఈ బంద్‌కి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
Share your comments