రైతులు పండించే పంట చేతికి వచ్చే వరకు రైతుకు ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. తీవ్ర వర్షాభావం కారణంగా పంటలు పండక పోవడం లేదా అతివృష్టి కారణంగా చేతికొచ్చిన పంట నాశనం కావడం, ఇవన్నీ సరిగ్గా ఉంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే గద్వాల్ జిల్లా లోని ఓ రైతు మాత్రం ఈ కష్టాలు అన్నింటిని ఎదుర్కొని అధిక లాభాన్ని పొందాడు. అయితే రైతు పొందిన ఆ లాభాన్ని పిల్లి బూడిద పాలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్ తన పంట అమ్మిగ వచ్చిన లక్ష రూపాయలను బ్యాంకు నుంచి తీసుకువచ్చి ఒక బాక్స్ లో పెట్టి భద్రపరిచాడు. ఆ లక్ష రూపాయలతో తరువాత పంట పెట్టుబడుల కోసం ఆ డబ్బులను దాచుకున్నాడు. అయితే ఈ సోమవారం ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసి దీపాలు వెలిగించారు. ఉన్నపళంగా అక్కడికి ఒక పిల్లి వచ్చి దేవుడి గదిలోకి వెళ్లి ఆ దీపాలను తన్నింది.
వీరేష్ ఇల్లు పూరి గుడిసె కావడంతో దీపాలు కిందపడగానే ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.ఈ క్రమంలోనే మంటలను అదుపు చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపుకాలేక పూర్తిగా అతని ఇల్లు దగ్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటిలో దాచుకున్న లక్ష రూపాయలు డబ్బులు కూడా బూడిద పాలయ్యాయి. డబ్బులను ఎంతగా కాపాడుకుందామని ప్రయత్నించినప్పటికీ కాపాడుకోలేక పోయానని రైతు వీరేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పంట చేతికి వచ్చి అధిక లాభాల్ని పొందినప్పటికీ ఈ విధంగా పిల్లి రూపంలో తనకు తీవ్రమైన నష్టం కలిగించిందని రైతు వాపోయాడు.
Share your comments