వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో వ్యవసాయ అభివృద్ధి ,సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. అలాగే వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులను, వంగడాలను, వాతావరణ సమాచారాన్ని, ప్రభుత్వ పథకాల అమలు తీరును మొదలగు వ్యవసాయం సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకోవడానికి వీలుగా ఎన్నో మొబైల్ యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చి మారుమూల గ్రామీణ రైతులకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి తెలియజేయడం జరుగుతుంది. రైతులకు అందుబాటులో ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉన్నా కొన్ని మొబైల్ అప్లికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిఎం కిసాన్ మొబైల్ యాప్ : కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న పథకం "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన".ఈ పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా పీఎం కిసాన్ పథకం యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆధార్ అనుసంధానం, విడతలవారీగా డబ్బుల వివరాలు వంటివి రైతులు తమ మొబైల్ ద్వారా ఇంట్లో ఉండే సులువుగా పొందవచ్చు.
కిసాన్ సువిధ మొబైల్ యాప్ : ఈ యాప్ ద్వారా, రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ ధర, వ్యవసాయ సలహా, మొక్కల రక్షణ, APM పద్ధతుల గురించి వచ్చే ఐదు రోజుల సమాచారాన్ని పొందవచ్చు. ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ లోనే ముందస్తు వాతావరణ హెచ్చరికలు, ప్రాంతీయ, దేశీయ మార్కెట్లో వ్యవసాయ పంటల ధరలు, వ్యవసాయంలో సాంకేతిక పద్ధతి వంటి సేవలు తమ మొబైల్ ద్వారా సులువుగా పొందవచ్చు .
బనానా ప్రొడక్షన్ టెక్నాలజీ మొబైల్ యాప్:
రైతులు పండ్ల తోటల్లో అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంభించాలనే ఉద్దేశంతో
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR), నేషనల్ సెంటర్ ఫర్ బనానా రీసెర్చ్, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, హైదరాబాద్‌తో కలిసి అరటి రైతుల కోసం ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది.ఈ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలలో అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా రైతులు పంటను నాటినప్పటి నుంచి కోత కోసి మార్కెట్ తరలించే వరకు పూర్తి సమాచారాన్ని సులువుగా పొందవచ్చు.
ఈ-పంట యాప్ : రైతు సోదరులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాగుచేస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, సబ్సిడీ ఎరువులు,విత్తనాలు , పురుగుమందులు వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కోల్పోతే నష్టపరిహారం వంటి ప్రయోజనాలను తక్షణమే రైతులు పొందడానికి ప్రభుత్వం ఈ-పంట యాప్ అందుబాటులోకి తెచ్చింది.
మేఘదూత్ మొబైల్ యాప్ : ప్రాంతీయ భాషల్లో వివిధ పంటల వివరాలు, పశువుల వివరాలు,
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్తంగా యాప్ ప్రారంభించాయి.మేఘదూత్ యాప్‌లో వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ వంటి సమాచారం వారానికి రెండుసార్లు అంటే మంగళవారం,శుక్రవారం సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది.
Share your comments