పంటను పట్టి పీడించే చీడపీడలతో పాటు, ఇటీవల కాలంలో వన్య ప్రాణులు కూడా భారీ పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు, కోతులు, మరికొన్ని చోట్ల ఏనుగులు పొలాల్లోకి చొరబడి పంట నాశనం చేసి రైతుల కష్టానికి ఫలితం లేకుండా చేస్తున్నాయి. అడవి ప్రాంతాలకు దగ్గరలో ఉన్న పొలాలకు ఈ వన్యప్రాణుల సమస్య అధికంగా ఉంటుంది.
వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు మేరకు, అడువుల్ని నాశనం చేసి, పంట పొలాలుగా, నివాస ప్రాంతాలుగా మారుస్తున్నాం. ఈ అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ఆహారం దొరక్క పంట పొలాల మీద పడి, రైతులకు నష్టం వాటిల్లేలా చేస్తున్నాయి. మొక్క జొన్న, కూరగాయలు, పళ్ళ తోటలు అడవి జంతువుల ఆక్రమణకు ఎక్కువుగా గురవుతున్నాయి.
పంట నష్టం కలిగించే వన్య ప్రాణుల్లో అడవి పందులు ప్రధానమైనవి. అయితే వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా, వీటిని చంపడం చట్టరీత్య నేరం. అడవి పందులు పొలంలోకి చొరబడకుండా నివారణ చర్యలను చేపట్టడం ద్వారా వీటి బెడదను తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.....
అడవి పందులు, ఎక్కువుగా భూమిలోని దుంపలను, తిని వాటి జీవనం కొనసాగిస్తాయి. ప్రస్తుతం అడవుల్లో ఆహార లభించక, ఆహారాన్ని వెతుకుంటూ రైతుల పొలంలోకి చొరబడుతున్నాయి. అడవి పందుల్లో దృష్టిలోపం అధికంగా ఉంటుంది, ఇవి కేవలం వాటి వాసన శక్తీ ద్వారా ఆహారం సంపాదించుకుంటాయి.
సాంప్రదాయ పద్దతుల ద్వారా వీటిని పొలాల్లోకి రాకుండా నివారించేందుకు పొలంచుట్టు, గ్రీన్ నెట్స్ లేదంటే చీరలను కట్టడం ద్వారా వీటిని కొంత వరకు నియంత్రించవచ్చు. వీటికి దృష్టిలోపం ఉన్నందున, పొలం చుట్టూ ఉంచిన చీరలు లేదా నెట్స్ తగలగానే, ఆపద ఉన్నట్లు భావించి పారిపోతాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ పద్ధతి అంత సమర్ధవంతంగా పనిచెయ్యట్లేదు కనుక రైతులు ప్రత్యామ్నాయ పద్దతులను పాటించవలసి ఉంది.
కొన్ని ప్రాంతాల్లోని రైతులు కుళ్ళిన కోడి గుడ్లును నీటిలో కలిపి పొలం చుట్టూ ఉన్న గట్ల మీద చల్లుతారు. సాధారణంగా కోడి గుడ్లు ఎండే కొద్దీ వాసనా అధికమవుతూ వస్తుంది, ఈ వాసనకు అడవి పందులు పొలం దగ్గరకు రాలేవు. కాకపోతే ఈ పద్ధతి ద్వారా అడవి పందులను కొద్దీ రోజులు మాత్రమే నివారించగలం.
అడవి పందులను సాంప్రదాయ పద్దతుల ద్వారా తక్కువ ఖర్చుతో నివారించగలిగిన, కొన్ని సార్లు ఈ పద్ధతులు అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ పొలం ఉన్నవారికి వీటి ద్వారా నియంత్రణ కష్టతరం అవుతుంది. ఇటివంటి వారు పొలం చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం, ప్రస్తుతం మార్కెట్లో సోలార్ శక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ జంతువుల ప్రాణానికి ఎటువంటి హాని చెయ్యకుండా ఉండే విధంగా రూపొందించబడినవి. అడవి పందులు ఈ ఫెన్సింగ్ వైర్లకు తగలగానే కొద్దీ పాటి షాక్ కలుగుతుంది, దీని మూలంగా రెండవ సారి పొలంలోకి చొరబడే ప్రయత్నం చెయ్యవు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోలేనివారు, పోలచుట్టు గట్ల మీద మూళ్ళ మొక్కలను నాటుకుని, పొలంలోకి అడవి జంతువులూ రాకుండా కట్టడి చెయ్యవచ్చు.
Share your comments