పంటకాలంలో అనేక రకాల చీడపీడలు, వైరస్లు, బాక్టీరియా తెగుళ్లు పంటకు అధిక నష్టం కలిగిస్తాయి. వీటి మూలాన పంట దిగుబడి తగ్గిపోవడమే కాకుండా, దిగుబడి నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయితే పంటలో వచ్చే చీడపీడలను నివారించడానికి, మార్కెట్లో అనేక రకాల పురుగుమందులు, శిలింద్రనాశనులు అందుబాటులో ఉన్నాయి. ఈ రసాయన మందులను విచక్షణ రహితంగా వాడటం మూలాన మట్టి విషతుల్యం అవ్వడమే కాకుండా, పంట మీద పురుగుమందుల అవశేషాలు కూడా మిగిలిపోతున్నాయి. పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటే అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు చెయ్యడం కుదరదు.
పొగాకులో చీడపీడల సమస్య ఎక్కువుగా ఉంటుంది. వీటిని నివారించడానికి పురుగుమందులను విచక్షణ రహితంగా వాడటం మూలాన పొగాకులో పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. ఇటువంటి పొగాకును తాగే వారి ఆరోగ్యానికి కూడా హాని తలైతే అవకాశం ఉంటుంది. పొగాకులో అవశేషాలు పరిమితికి మించి ఉంటే, ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదంతో పాటు మార్కెట్లో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ విపణిలో పొగాకు ఎగుమతులను గణనీయంగా పెంచేందుకు రైతులు సస్య రక్షణ యాజమాన్యంలో మెళుకువలు పాటించాల్సివుంది.
పొగాకులో ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పొగాకు పంటలో అన్యపదార్థాలు, రసాయన మందులు లేకుండా పంట ఉత్పత్తి చేస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండోసల్ఫాన్ , ప్రోఫినోఫాస్, ఎసిఫేట్, క్లోరోఫైరీఫాస్, మోనోక్రోటోఫాస్, క్వినాల్ ఫాస్, ఫెన్ వలరేట్, లిండేన్, పొడి మందులు వంటి వాటిని పొగాకు పంటలో వినియోగించకుండా ఉండటం మంచిది. ఇటువంటి మందులు వినియోగించని రైతులకు ప్రోత్సహకాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
పొగాకు సాగులో రసాయన మందుల వాడకం తగ్గించడం చాలా అవసరం. మందుల అవశేషాలు తగ్గించేందుకు, వీలైనంత మేరకు సస్యరక్షణ చర్యలు పాటించడం ముఖ్యం. ఇందుకోసం ఎర పంటలు, కంచె పంటలు, వేప, కానుగ మందులు, ఎన్ పి వి వాడటం ద్వారా పంట నాణ్యతను పెపొందించుకోవాలి.నిషేధించిన మందులు, పొడి మందులు, గుళిక మందులను తగ్గించడం చాలా అవసరం. పురుగు మందులు చల్లేందుకు సరైన నాణ్యతా ప్రమాణాలు గల స్ప్రేయర్లనే వాడాలి. సిఫారసు చేసిన మందులనే ఉపయోగించాలి. పొగాకులో పురుగు మందుల వాడకాన్ని తగ్గించటం ద్వారా మార్కెట్లో మంచి ధర ను పొందేందుకు అవకాశం ఉంటుంది.
Share your comments