Kheti Badi

అధిగ లాభాలను తెచ్చిపెట్టే పసుపుపంట సాగు విధానం....

KJ Staff
KJ Staff

పసుపు మన భారతియా జీవనశైలిలో ఒక భాగం. పసుపును మంగళకరమైనదిగా భావిస్తారు, ఇదైనా శుభకార్యం జరగాలంటే పసుపుతోనే సాధ్యపడుతుంది. అంతే కాదు పసుపును సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. పసుపు యాంటిసెప్టిక్గా పనిచేసి చర్మ మరియు అంతరుగ్మతులను నియంత్రిస్తుంది.

అనేక ప్రయోజనాలు ఉన్న పసుపుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరైన సమయంలో విక్రయించగలిగితే పసుపు పంట మంచి లాభాలను తెలిపెడుతుంది. ఇప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి పసుపు పంట నుండి మంచి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు దుంప జాతికి చెందిన పంట. పసుపులో ఉండే 'కార్క్యుమిన్' మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. భారత దేశంలో తయారు చేసే చాల వరకు ఆహారపదార్ధాలలో పసుపును ఉపయోగిస్తారు. పసుపు ఆహారానికి రంగును, రుచిని అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో పసుపును అధిక మొత్తంలో పండిస్తున్నారు. పసుపును పండించడానికి, కొన్ని నూతన పద్దతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు.

పసుపులో రకాలు: పంట కాలాన్ని బట్టి పసుపును మూడు రకాలుగా విభజిస్తారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, మరియు దీర్ఘకాలిక రకాలుగా పసుపును వర్గీకరిస్తారు. స్వల్పకాలిక రకాలు 6-7 నెలల్లో దిగుబడిని ఇస్తాయి, అలాగే మధ్య కాలిక రకాలు 7-8 నెలల్లో దిగుబడిని ఇస్తాయి, చివరిగా దీర్ఘకాలిక రకాలు 9-11 నెలల్లో పంట దిగుబడిని అందిస్తాయి. స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లైతే ఒక పంట సీసన్ లోనే పంట దిగుబడి వస్తుంది, నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలు సాగు చేయడం మంచిది.

మట్టి యాజమాన్యం:

పసుపు రైతులను ప్రధానంగా పట్టి పీడించే సమస్య, దుంప కుళ్ళు తెగులు, భూమి నుండి సంక్రమించే ఈ వ్యాధి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. దుంప తట్టుకుని నిలబటంలో 'ప్రగతి' అనే స్వల్పకాలిక రకం మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మెరుగైన రకాల ఎంపికతో పాటు మట్టి యాజమాన్యంలో కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ దుంప కుళ్ళును నివారించవచ్చు. సాధారణంగా పసుపును బోదె పద్దతిలో రైతులు సాగు చేస్తారు. ఈ పద్దతిలో సాగు చెయ్యడానికి అధిక మొత్తంలో విత్తనం అవసరం ఉంటుంది పైగా నీటి అవసరం ఎక్కువ. ఈ పద్ధతి ద్వారా దుంప కుళ్ళు త్వరగా సంక్రమిస్తుంది. అదే రైతులు బెడ్లను ఏర్పాటు చేసుకుని, వాటి పైన పసుపును సాగు చేస్తే దుంప కుళ్ళును అరికట్టవచ్చు, బెడ్ విధానానికి డ్రిప్ ఇరిగేషన్ జతపరిస్తే, నీటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. మట్టిని దుంప ఎదిగేందుకు వీలుగా మెత్తగా దున్నుకుని, తరువాత బెడ్లను ఏర్పాటుచేసుకోవాలి. ప్రతి బెడ్ ఒక మీటర్ వెడల్పుతో, 30 సెంటీమీటర్ల ఎత్తుతో సిద్ధం చేసుకోవాలి.

విత్తన శుద్ధి:

పంట నాటే ముందు, విత్తన శుద్ధి చెయ్యడం ద్వారా, దుంప కుళ్ళును నియంత్రించడంతో పాటు, దుంప పుచ్చు, పంట ఎదిగాక వచ్చే ఆకు మచ్చ తెగులు, వంటి వాటిని తట్టుకుని మొక్క నిలబడగలదు. విత్తన శుద్ధిని సేంద్రియ పద్దతిలో కానీ, రసాయన పద్దతిలో నిర్వహించవచ్చు. సేంద్రియ పద్దతికి బీజామృతాన్ని రైతులు వినియోగిస్తారు. అలాగే రసాయన పద్దతిలో విత్తన శుద్ది జరిపేందుకు, ఒక లీటర్ నీటికి 1 గ్రాము కార్బెన్డిజిమ్+ 5 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి, పసుపు దుంపలను 30 నిమిషాల పాటు నానబెట్టాలి, తరువాత దుంపలను శుభ్రంగా కడిగి విత్తుకోవడం ద్వారా దుంప కుళ్ళు వంటి రోగాలను అరికట్టవచ్చు.

పంట యాజమాన్యం:

పంట సాగు విధానం బట్టి విత్తనాల పరిమాణం ఆధారపడి ఉంటుంది, బోడి విధానంలో ఐతే ఒక ఎకరానికి 700-1000 కేజీల వరకు విత్తనం అవసరం ఉంటుంది అదే బెడ్ విధానంలో ఐతే ఒక ఎకరానికి 100-150 కిలోల విత్తనం సరిపోతుంది. పసుపును నాటిన దగ్గర నుండి 30 రోజుల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండ నివారించుకోవాలి, తద్వారా మొక్క నీటిని పోషకాలను సమంగా తీసుకుని, బలంగా ఎదుగుతుంది. కలుపు తీవ్రత ఎక్కువుగా ఉన్న చోట్ల ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో 800 గ్రాముల అట్రాజిన్ కాల్పుమందును కలిపి పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి. పసుపులో పోషక యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. పంట ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్, 10 కిలోల జింకసల్ఫేట్ కలిపి దున్నుకోవాలి. పసుపు నాటిన 40 రోజుల తర్వాత యూరియా 50 కిలోలు అందించాలి, ఇదే సమయంలో ఒక ఎకరానికి 200 కిలోల వేపపిండిని వేసినట్లయితే, మట్టినుండి పుట్టే చీడపీడలను సమగ్రసస్యరక్షణ ద్వారా అరికట్టవచ్చు. చివరిగా పంట 80-110 రోజుల దశలో ఉన్నపుడు ఒక ఎకరానికి 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ మొక్క మోడళ్ల వద్ద వేసి నీటిని అందిస్తే, మొక్క పోషకాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుంది.

ఈ విధంగా పసుపు పంటలో సమగ్రంగా మెరుగైన యాజమాన్య పద్దతులను పాటించడం ద్వారా మంచి దిగుబడిని, మార్కెట్లో మంచి లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine