ఈ మధ్యకాలంలో పంటల్లో పురుగుమందులు మరియు రసాయన ఎరువులు వినియోగం ఎక్కువవ్వడం వల్ల మట్టిలోని సారం క్షిణిస్తూ వస్తుంది, అంతేకాకుండా ఇటువంటి రసాయనాల ద్వారా పండిన ఆహారం తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వీటివల్ల ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం, రైతులందరు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వెయ్యాలని పిలుపునిచ్చింది, అన్నదాతలు కూడా క్రమక్రమంగా ఈ పద్దతిని అవలంభించడంతో, ప్రకృతి వ్యవసాయం ఎన్నో వేల ఎకరాలకు విస్తరిస్తుంది. వినియోగదారులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలకు మొగ్గు చూపడంతో వీటికి మార్కెట్లో కూడా డిమాండ్ అధికంగానే ఉంటుంది.
కానీ ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే కాషాయాలు ఎలా తయారుచేసుకోవాలి అన్న అవగాహనా లేక, ఈ పద్దతిని పాటించడం కష్టతరంగ మారుతుంది, అలాగే ఇళ్లవద్ద పెరటి పంటలు, టెర్రస్ గార్డెనింగ్ చేసేవారికి కూడా ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన లోపాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి వారికోసం ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ కాషాయాలు దొరుకుతున్నాయి వాటిని ఉపయోగించి పంట దిగుబడిని పెంచుకోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసినవారవుతారు.
ప్రకృతి వ్యవసాయం అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జీవామృతం. ఈ జీవామృతాన్ని వినియోగించడం ద్వారా మొక్కలు బలంగా ఎదగడమే కాకుండా, చీడపీడలను తట్టుకునే శక్తీ మొక్కలకి లభిస్తుంది. అయితే జీవామృతాని తయారుచేసే రైతులు కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకోవాలి. జీవామృతం తయారీలో అతిముఖ్యమైనది ఆవుపేడ మరియు మూత్రం, వీటిని కేవలం దేశవాళీ ఆవుల నుండి మాత్రమే సేకరించాలి, విదేశీజాతి ఆవుల పేడ మరియు మూత్రం పనికిరాదు. ఈ జీవామృతం మొక్కలకు ఎరువుగాను మరియు చీడపీడల నుండి నివారణ కల్పించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో కోట్లా సంఖ్యలో బాక్టీరియా ఉంటుంది, ఇది మట్టిలోని పోషకాలు కరిగి మొక్కలకు అందేలా చేస్తుంది.
జీవామృతం తరువాత రైతులు ఎక్కువగా వినియోగించేది నీమాస్త్ర, దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. దీని కోసం 5 కేజీల వేపాకును బాగా నూరి ఒక ముద్దలాగా తయారుచేసుకోవాలి. ఒక పెద్ద డ్రమ్ములో 100 లీటర్ల నీరు, వేపాకు ముద్ద, ఒక కిలో ఆవుపేడ మరియు, ఐదు లీటర్ల గోమూత్రం వేసి, బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మూసి ఒక రోజు మొత్తం ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డ సహాయంతో వడకట్టి, మొక్కలపై పిచికారీ చెయ్యాలి. నీమాస్త్రం, రసం పీల్చు పురుగులు, లార్వాలను మరియు, గుడ్లను సమగ్రవంతంగా నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి.
దీనితోపాటు, ఈ మధ్యకాలంలో రైతులు దశపర్ణి కషాయాన్ని కూడా విరివిగా వినియోగిస్తున్నారు. దశ అంటే పది అని అర్ధం, అలాగే పర్ని అంటే ఆకులు అనిఅర్ధం, మొత్తానికి 10 రకాల ఆకులతో తయారుచేసిన కషాయాన్ని దశపర్ణి అని పిలుస్తారు. ఈ మిశ్రమాన్ని తయారుచేసుకోవడానికి 5 కేజీల వేపాకులు, బొప్పాయి మరియు ఆముదం- 2 కేజీలు సీతాఫలం ఆకులు- 2 కేజీలు, తిప్పతీగ ఆకులు- 2 కేజీలు, కారంజ ఆకులు- 2 కేజీలు, జట్రోప ఆకులు- 2 కేజీలు, ఎర్ర గన్నేరు ఆకులు- 2 కేజీలు, జిల్లేడు ఆకులు- 2 కేజీలు, వీటన్నిటిని నూరి ముద్దగా చేసుకొని, ఒక పెద్ద డ్రమ్ములో 200 లీటర్ల నీరు, ఈ ఆకుల మిశ్రమం, పచ్చిమిర్చి పేస్ట్ 2 కేజీలు మరియు అల్లం పేస్ట్ 250 గ్రాములు ఈ నీటికి కలపాలి. తరువాత దేశవాళీ ఆవు నుండి సేకరించిన ఆవుపేడ 3 కేజీలు మరియు ఆవు మూత్రం 5 లీటర్ల ఈ నీటిలో వేసి బాగా కలపాలి. ఒక వారం తరువాత ఈ మిశ్రమానికి 3 లీటర్ల నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నెల రోజులపాటు పులియబెట్టి, తరువాత వడగట్టి, ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. దశపర్ణి కాషాయం నీమాస్త్రం కంటే ఎంతో శక్తివంతమైనది. దీనిని నేరుగా మొక్కల మీద ఉపయోగించకూడదు, 125 మిల్లీలీటర్ల దశపర్ణి, 10 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించాలి.
Share your comments