వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో చాలా తక్కువగా ఉండే తేమ వంటివి వేసవి పంటలకు ముఖ్యంగా కూరగాయ పంటలకు అనేక సమస్యలను తీసుకొస్తుంటాయి.
వీటన్నింటినీ తట్టుకొని కూరగాయల పంటలను పండించాలంటే అధిక వేడిని తట్టుకొనే ప్రత్యేక రకాలను విత్తుకోవడంతో పాటు వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిపుణుల సలహాలను పాటిస్తూ కూరగాయలను సాగు చేస్తే మంచి లాభాలను పొందే వీలుంటుంది.
ఇలా నాటుకోండి..
వేసవిలో కూరగాయలు నాటుకోవడానికి నారు పోస్తుంటే దాన్ని సాధారణంగా పొలంలో కాకుండా కాస్త నీడ కింద నాటుకోవాలి. అంతే కాదు.. వేసవిలో కూరగాయల పంటలకు చాలా రకాల పురుగులు ఆశిస్తూ ఉంటాయి. వీటి నుంచి నివారించుకోవడానికి ముందే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందు కోసం లడాక్లోఫ్రీడ్ ని ఐదు గ్రాములు తీసుకొని అందులో కిలో విత్తనాలను శుద్ధి చేయవచ్చు. పెద్ద పెద్ద చెట్లైన మామిడి, జామ, కొబ్బరి వంటి పండ్ల తోటల్లో మొదటి మూడు నుంచి నాలుగేళ్లు ఇలా కూరగాయలు పండించడం వల్ల మంచి లాభాలను పొందే వీలుంటుంది. ఇలా పండించేందుకు బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, చిక్కుడు, గోరు చిక్కుడు వంటి కూరగాయలు ఎంచుకోవచ్చు.
ఇలా తోటలు లేని వారు ఆముదం, మొక్క జొన్న వంటి మొక్కలను కూరగాయల మొక్కలకు నీడ కోసం ఉత్తర దక్షిణ దిశల్లో ఏర్పాటు చేసుకోవాలి. వీలుంటే షేడ్ నెట్ లను ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. మడుల్లో విత్తనాలన్నింటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా విత్తుకోవడం మంచిది. దీనివల్ల పంట మొత్తం ఒకేసారి కాకుండా రెండు మూడు విడతల్లో రావడం వల్ల అమ్మకానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే కాదు.. ధరల్లో కూడా వ్యత్యాసం ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని దగ్గరగా నాటుకోవచ్చు.
నీటి ఎద్దడి నివారణ
వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే నేలలోని తేమను రక్షించే చర్యలు చేపట్టాలి. ఇందుకోసం కేవలం సేంద్రియ ఎరువులను, జీవ ఎరువులను ఉపయోగించాలి. ఇవి నేలను గుల్లబరిచి తేమ బయటకు పోకుండా పట్టి ఉంచుతాయి. రెండు వరుసల మధ్యలో వరి గడ్డి, ఊక, వేరు శనగ పొట్టు, ఎండుటాకులు, పచ్చి రొట్ట వంటివి వేసుకోవాలి. దీనివల్ల నేలలోని నీరు ఆవిరై పోకుండా కాపాడుకోవచ్చు. దీనివల్ల కలుపు కూడా తక్కువగా పెరుగుతుంది. నీటిని డ్రిప్ పద్ధతిలో అందించడం వల్ల ఎక్కువ విస్తీర్ణంలో పండించే వీలుంటుంది. ఇలా అందించే వీలు లేకపోతే సాయంత్రం లేదా ఉదయం వేళల్లో నీటిని అందించాల్సి ఉంటుంది. కూరగాయలు,ఆకుకూరలను కట్ చేసిన తర్వాత కూడా తడి గోనె సంచి కప్పి మార్కెట్ కి పంపాలి. సాధారణ స్థాయిలో మూడు నాలుగు రోజులకోసారి నీటిని అందిస్తూ పూత, పిందె దశల్లో శ్రద్ధ చూపించాలి. క్రమ పద్ధతిలో నీటిని అందించకపోతే కాయ పగిలే ప్రమాదం ఉంటుంది. వంకాయలో ఇలా అయితే కాయలు పరిమాణం తగ్గి చేదు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కనీసం మూడు రోజుల కోసారైనా నీటిని అందించాలి. ముఖ్యంగా పూత, పిందె, కాయ ఎదిగే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కనీసం వారానికి రెండు సార్లైనా నీటిని అందించాలి. కోతల సమయంలో నీటిని రోజు విడిచి రోజు అందించాలి.
తెగుళ్లు, సంరక్షణ
బిందు సేద్యం పద్ధతిలో మొక్క వేళ్ల వద్ద నీటి తడి తక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు ఆదా చేసుకోవడంతో పాటు తెగుళ్లు కూడా తగ్గుతాయి. వేసవిలో రసాయన ఎరువులు వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. ఒకవేళ వేసినా మొక్కకు దూరంగా వేయాలి. నీటిలో కరిగే ఎరువులను నీటితో పాటుగా అందించాలి. వేసవిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. జొన్న లేదా సజ్జ చేలను అడ్డంగా వేయడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు. పొలంలో అక్కడక్కడా పసుపు డబ్బాల్లో గ్రీజు పూసి పెట్టడం వల్ల తెల్లదోమలు ఆకర్షితమై అందులో పడిపోతాయి. మొక్కలకు వేప కషాన్ని ఐదు శాతం మేర నీటిలో కలిపి ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులను నివారించేందుకు డై మిథియేట్ 2 ఎంఎల్ ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తీగ జాతి కూరగాయల్లో ఈ సమస్య ఉంటే మలాథియాన్ 2 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కలుపు నివారణ కోసం క్విజెల్ ఫాల్ ఇథైల్ 400 ఎంఎల్, ప్రొపొక్విజాపాస్ 250 ఎంఎల్ లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా 20 రోజులకోసారి చేయాలి.
https://telugu.krishijagran.com/kheti-badi/get-good-amount-of-profits-with-cucumber-farming/
Share your comments