మన దేశంలో జరిగే అన్ని శుభకార్యాలకు పసుపు తప్పనిసరి. హిందువులు పసుపును మంగళప్రదమైందిగా భావిస్తారు. వేడుకలతోపాటు, వంటల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పసుపును పచ్చ బంగారంగా భావిస్తారు. పసుపు పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీరణంలో సాగు చేస్తున్నారు. పసుపు పంటకు అనువైన యాజమాన్య పద్దతులను పాటిస్తూ రైతులు అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.
పసుపు దుంప జాతి మొక్క. పసుపు పంట సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో 25-30 డిగ్రీల ఉష్ణోగ్రత సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగుకు నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, మరియు గరపా మొదలైన నేలలు అనుకూలిస్తాయి. సాగుకు అధిక ఉష్ణోగ్రత అవసరం కాబట్టి, మే మూడో వారం నుండి జూన్ రెండో వారం వరకు సాగు చేపట్టవచ్చు. పసుపు సాగు చేపట్టే రైతులు మురుగు నీటి పారుదల సక్రమంగా ఉన్న నేలలను ఎంచుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉన్నట్లైతే వేరుకుళ్లు మరియు దుంప కుళ్ళు వంటి సమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది. దీని వలన రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
పసుపు పంటను బోదె పధ్దతిలోను అలానే ఎత్తు మడుల పధ్దతిలోను సాగు చేస్తారు. అయితే ఎత్తు మడుల్లో సాగు చెయ్యడం ద్వారా, వేరు కుళ్ళు మరియు దుంప కుళ్ళు వంటి సమస్యలను నివారించవచ్చు. బోదెల పద్దతిలో ప్రతి వరుసకు మధ్య 45-50 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి, అలాగే బోదె మీద ప్రతి దుంపకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఎత్తుమడుల మీద సాగు చెయ్యడానికి ఒక మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుతో మడులను తయారుచేసుకొని, మడుల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. దుంపల మద్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి.
పసుపు సాగుకు కలుపు ప్రధాన సమస్యగా నిలుస్తుంది. కలుపు బెడద ఎక్కువుగా ఉన్న ప్రదేశాల్లో దుంపలు నాటిన మరుసటి రోజే అట్రాజిన్ మందును ఎకరానికి 600 గ్రాములు, 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దుంపలు నాటిన 40-45 రోజుల వ్యవధిలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. కలుపును సమగ్రవంతంగా నివారించడానికి, 3-4 సార్లు అంతరకృషి చేపట్టాలి. పసుపు సాగుకు సేంద్రియ నేలలు బాగా అనుకూలిస్తాయి. పసుపు నాటే ముందు పంట ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నుకోవాలి, తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. పశువుల ఎరువుతోపాటు, చివరి దుక్కిలో 200 కిలోల వేప పిండి మరియు ఆముదం పిండి వేసీ కలియదున్నుకోవడం ద్వారా రోగాలను కొంత మేరకు నియంత్రించవచ్చు. పసుపు నాటుకున్న 35-40 రోజుల మధ్యలో 50 కిలోల యూరియా మరియు 200 కిలోల వేపపిండి రెండు కలుపుకొని వేసుకోవాలి.
Share your comments