Horticulture

జామ సాగులో పాటించవలసిన సస్యరక్షణ చర్యలు.....

KJ Staff
KJ Staff

మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో, తెలుగు రాష్ట్రాల్లో, జామ సాగు చేపడుతున్న రైతుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జామపండులో అధిక పోషకాలు ఉండటం, శరీరానికి అవసరమైన శక్తిని అందించడం, మరియు వైద్యులు కూడా వీటిని తినమని సూచించడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే జామ సాగు చేపట్టే రైతులు, యాజమాన్య పద్దతుల మీద మరియు చీడపీడల నివారణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసి ఉంటుంది చీడపీడలు నుండి పంటను కాపాడుకుంటే ఆసించినంత మేరకు దిగుబడి సాధించవచ్చు. ఇందుకోసం సరైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది.

జామసాగులో పండు ఈగ ప్రధానమైన సమస్య. ప్రతి ఏడాది పండు ఈగ జామలో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. తల్లి ఈగలు కాయ పక్వ దశలో ఉన్నప్పుడు చర్మం మీద గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తరువాత కాయలోపలికి చొచ్చుకుని పోయి గుజ్జును మొత్తం తినేస్తాయి. పండు ఆశించిన పళ్ళు మార్కెట్కి పనికిరావు, పైగా పళ్ళు మొత్తం రాలిపోతాయి. పండు ఈగను నివారించడానికి 2 మి.లి మిథైల్ యూజినాల్, 3 గ్రాముల కార్బొఫ్యురన్, ఏదైనా మందును ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ ద్రావణాన్ని 200 మిల్లి లీటర్లు ప్లాస్టిక్ సీసాల్లో నింపి వాటిని తోటల్లో అక్కడకక్కడ కొమ్మలకు వేలాడదియ్యాలి. ఈ ద్రావణాన్ని మగ ఈగలు ఆకర్షితమై, ద్రావణంలో పడి చనిపోతాయి.

పండు ఈగతో పటు కాండం తొలిచే కూడా జామ తోటల్లో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. చెట్ల మొదళ్ళ నుండి కాండంలోకి చొచ్చుకుని పోయి మొక్క బలహీనపడేలాగా చేస్తుంది. కాండం లోపలి భాగాన్ని మొత్తం తినెయ్యడం ద్వారా, చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా కాయలు మరియు కొమ్మలను ఆశించి, జిగురు వంటి పదార్ధాన్ని విసర్జించడం వలన మసితెగులు సోకే ప్రమాదం ఉంటుంది. వీటి కారణంగా కాయ ఏర్పడక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. కాండం తొలుచు పురుగును నివారించడానికి రంద్రాలను శుభ్రపరచు, వాటిలో పెట్రోల్ లేదా కిరోసిన్ వెయ్యడం ద్వారా పురుగు చనిపోతుంది. ఈ రంద్రాల్లో కార్బొఫ్యురన్ గుళికలను వేసి వాటిని రేగడి మట్టితో కప్పేయాలి.

పిండి నల్లి కూడా జమ తోటల్లో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పిండి నల్లి మొక్కలను ఆశించడానికి, తోటల్లో తేమ ఎక్కువుగా ఉండటం, చెట్ల మధ్య దూరం లేకపోవడం, మరియు నీరు నిలిచిపోవడం, లాంటి పరిస్థితులు కారణం కావచ్చు. ఈ పిండి నల్లి కొమ్మలను మరియు ఆశించి నష్టం కలిగిస్తాయి. ఆకులను పిండి వంటి పదార్ధంతో కప్పేయడం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగక మొక్కల పెరుగుదల తగ్గి కాపు తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి ఎసిఫేట్ 1 గ్రాము, లేదా డైక్లోరోఫాస్ 1మి.లి ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

తెల్లదోమ పిల్ల పురుగులు జామ ఆకులపై తెల్లని దూదివంటి మెత్తని పదార్థంతో కప్పటం ద్వారా ఆకుల రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకి, రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తోటలో ఉంచాలి. ప్రథమ దశలో పురుగు ఆశించిన కొమ్మలను కత్తిరించి, వేపనూనెను 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఫాస్పామిడాన్ లేదా డైక్లోరోవాస్ లేదా హెూస్థా థయాన్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెల్లదోమను నివారించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine