నిమ్మ జాతికి చెందిన మొక్కల్లో నిమ్మ, బత్తాయి, నారింజ, మొక్కలను రైతులు ప్రధానంగా సాగు చేస్తారు. నిమ్మ జాతి మొక్కలు సాగు చేసే రైతులు ప్రధానంగా ఎదురుకునే సమస్యల్లో కాయ చిట్లిపోవడం ఒకటి, దీనినే ఫ్రూట్ స్పిల్లిటింగ్ అంటారు. సరైన రక్షణా చర్యలు పాటించనట్లైతే, అధిక మొత్తంలో కాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది.
అయితే కొన్ని మెరుగైన యాజమాన్య పద్దతుల ద్వారా నిమ్మ జాతి కాయల్లో పగుళ్ళను తగ్గించవచ్చు. కాయ పగుళ్ల నివారణ చర్యలు గురించి తెలుసుకునే ముందు, నిమ్మ జాతి మొక్కల్లో ఈ సమస్య రావడానికి గల కారణాన్ని తెలుసుకోవడం మంచిది.
కాయపగుళ్ళకు కారణాలు:
కాయపై భాగంలో పగుళ్లు ఏర్పడటానికి, వాతావరణంలో తేమ, మట్టిలో నీటి శాతం, పోషక విలువల లభ్యత, ఉష్ణోగ్రతలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కాయలో పగుళ్ళను తగ్గించడంలో నీటి యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. మట్టిలోని తేమను బట్టి నీటిని అందించాలి, అధికంగా నీరు అందించినట్లైతే, మొక్క నీటిని ఎక్కువుగా పీల్చుకుని కాయ పై పగుళ్లు ఏర్పడటనికి కారణం అవుతుంది. అలాగే నిమ్మ జాతి మొక్కల్లో బోరాన్ ధాతువు కాయ ఏర్పడటంలో కీలక పాత్ర పోషితుంది, మట్టిలో బోరాన్ లోపించినట్లైతే కాయలో పగుళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. రానున్నది వేసవి కాలం, నిమ్మ మరియు బత్తాయికి ఈ సీజన్లో అధిక డిమాండ్ ఉంటుంది, అంతే కాకుండా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కాయ మీద పగుళ్లు ఏర్పడి పంట నష్టం అధికంగా ఉంటుంది.
కాయపగుళ్ళను నివారించడం:
మట్టిలో పోషకాల లోపం ఉన్నట్లైతే కాయ పగుళ్లు ఎక్కువుగా ఉంటాయి. బోరాన్ తో పాటు, కాల్షియమ్, పొటాషియం లోపాలు కూడా కాయ పగులుకు కారణం అవుతుంది. ఈ పోషకాలు పళ్ళ మీద తొక్క భాగం ఏర్పడటానికి సహాయపడతాయి, ఈ పోషకాలు లోపం ఉన్న మొక్కల్లో పైన తోలు భాగం పల్చగా ఏర్పడుతుంది, తద్వారా కాయ లోపలి గుజ్జు యొక్క ఒత్తిడి చర్మం పై పడి పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారించేందుకు కాల్షియమ్ నైట్రేట్, నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి అలాగే వేసవి ఆరంభంలో పొటాషియం నైట్రేట్ మొక్క మొదళ్ళలో అందించాలి. వేసవి కాలంలో నీటి యాజమాన్యం సరిచూసుకోవాలి, కొన్ని రోజుల పాటు నీరు అందించకుండా ఒకేసారి నీటిని అందిస్తే, మొక్క ఒకేసారి అధిక మోతంలో నీటిని పీల్చుకుంటుంది, ఆలా తీసుకున్న నీరంతా కాయల్లోకి చేరుతుంది, దీని వలన కాయలోపలి భాగంలో ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి.
వేసవి కాలానికి ముందు, చెట్టుకున్న ఎండు కొమ్మలను, ప్రూనింగ్ పద్ధతి ద్వారా తొలగించాలి, ఇలా చేస్తే చెట్టుపైన అదనపు భారం తగ్గి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చెయ్యచ్చు.
Share your comments