Horticulture

చామంతిపూల సాగు మరియు యాజమాన్య పద్దతులు....

KJ Staff
KJ Staff

జూన్ మాసం వచ్చిందంటే పండగల సీసన్ ప్రారంభమయినట్లే. ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పూల వినియోగం ఎంతో ఉంటుంది. పూలకు భారత మార్కెట్లతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది కాబట్టి పూల సాగు చేసే రైతులు మంచి లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. చామంతి పూల సాగు అధిక లాభాలు తెచ్చిపెట్టే పూల సాగులో ఒకటి. అయితే పూల సాగు చేపట్టే రైతులు మెరుగైన యాజమాన్య పద్దతులు కనుక పాటించినట్లయితే మేలైన రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. చామంతి సాగు కొరకు పాటించవలసిన పద్దతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కలు నాటే సమయం:

చామంతి మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడి అందివ్వడానికి పగటి పుట కాంతి తక్కువగాను మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉండేది వాతావరణం అనుకూలం. జూన్ మరియు జులై నెలలు సరిగ్గా ఇదే వాతావరణాన్ని కలిగి ఉండటం వలన నారు మొక్కలు ఈ సమయంలో నాటేందుకు అనుకూలం. ఇలా నాటిన మొక్కలు నుండి నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో పూలు పూస్తాయి. చామంతి సాగుకు తేలికపాటి నేలలు మరియు గరపా నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.7-7.0 మరియు నీటి పారుదల ఉండేలా చూసుకోవాలి.

పాలీహౌస్ లో సాగు:

చామంతి మొక్కలను పాలీహౌస్ లో సాగు చెయ్యడం ఉత్తమం, ఎందుకంటే పాలీహౌస్ లో రోగాలు మరియు పురుగుల ఉదృతి తక్కువుగా ఉంటుంది అంతేకాకుండా మొక్క ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి వీలుంటుంది. విదేశీ మార్కెట్లకు ఎగుమతి చెయ్యడానికి అనువుగా ఉండే పూలను ఉత్పత్తి చెయ్యడానికి పాలీహౌస్ లోని వాతావరణం అనుకూలిస్తుంది.

పాలీహౌస్ లో చేమంతి సాగు చేసే రైతులు ఉష్ణోగత- 16-25℃, వాతావరణ తేమ- 70-85% మరియు గాలిలోని కార్బన్ శాతం- 600-900 ppm ఉండేలా చూసుకోవాలి. మొక్కలకు అవసరమైన కాంతిని కూడా నియంత్రించవలసి ఉంటుంది. సాధారణంగా ఆకు కొమ్మ దశలో 13 గంటల కాంతి మరియు 11 గంటల చీకటి వాతావరణం కావాలి అదే పూత దశలో ఐతే 10 గంటల కాంతి మరియు 14 గంటల చీకటి వాతావరణం ఉండేలా చూడాలి.

పొలంలో సాగు:

పాలీహౌస్ తో పాటు, ఆరుబయట కూడా చామంతి పూల సాగును చేపట్టవచ్చు.చామంతి మొక్కలను పిలకలు మరియు కొమ్మ కత్తిరింపులు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో కొమ్మలను కత్తిరించి నారుమడిని నాటుకోవాల్సి ఉంటుంది, తల్లి మొక్కల నుండి 3-5 సెంటీమీటర్ల పొడవుతో, రెండు నుండి మూడు ఆకులున్న లేత కొమ్మలని మాత్రమే నారుమడికోసం వాడుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న నారుమడి, పాలీహౌస్ లేదా ఆరుబయట సాగుకు అనుకూలంగా ఉంటుంది.

మొక్కలను నాటేందుకు ప్రతి మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు మరియు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి, ఒక ఎకరానికి దాదాపు 55,000 నుండి 60,000 మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 70 కిలోల నత్రజని, మరియు 40 కిలోల పోటాష్ ఎరువులు వేసిని 2-3 సార్లు కలియదున్నాలి.

నీటి యాజమాన్యం:

పూల మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోలేవు కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి యాజమాన్యం చేపట్టాలి. వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో నీటిని అందించవలసిన అవసరం ఉండదు, కాకపోతే నీటి పారుదల ఉండేలా చర్యలు చేపట్టాలి. మొక్కలు నాటిన నెలవరకు ఒకవారానికి 2-3 తడులు అందివ్వాలి ఆ తరువాత వారానికి ఒక నీటి తడి అందిస్తే సరిపోతుంది.

చేమంతి మొక్కలు నాటిన ఒక నెల రోజుల తరువాత మొక్కల తలలను తుంచాలి, దీనినే పించింగ్ అంటారు. పించింగ్ చెయ్యడం ద్వారా పక్క కొమ్మలు ఎదిగి పూల సాగు పెరుగుతుంది. మొక్కలు ఎదిగాక పూల బరువుకి వంగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెదురు కొమ్మలతో ఊతం అందించాలి.

తెగుళ్లు:

చామంతి మొక్కలకు వచ్చే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు మరియు వేరు కుళ్ళు తెగులు ప్రధానమైనవి. ఆకుమచ్చ తెగులు సోకినా మొక్కలు ఆకులపై లోతైన గుండ్రటి మచ్చలు ఏర్పడి తరువాత ఆకులు వదిలిపోయి రాలిపోతాయి. ఈ తెగులును ఎదుర్కోవడానికి మాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

పొలంలో నీరు నిలిచిపోయే సమయంలో ఈ వేరు కుళ్ళు సమస్య తలెత్తడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన మొక్కలు ఉన్నటుంది వడలిపోయి ఆకులు రాలిపోతాయి. వేర్లు కూడా కుళ్లిపోతాయి, దీనిని నివారించడానికి పొలంలో నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ తెగులు నేల నుండి సంక్రమిస్తుంది కాబట్టి దీనిని నివారించడానికి, కాప్టాన్ 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి నేల మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి

పూలకోత:

చేమంతి పూలను విడి పువ్వులుగా లేదంటే కాడతో కూడిన కట్ ఫ్లవర్స్ లాగా విక్రయించవచ్చు. కట్ ఫ్లవర్స్ ఎగుమతి చేసేవారు అంతర్జాతియ ప్రమాణాలకు తగ్గట్టుగా పూలను కావూయవలసి ఉంటుంది. వీటిని గ్రేడ్లగా విభజిస్తారు, ఏ గ్రేడ్ పొందడం కోసం పూలు 75 సెంటీమీటర్ల కాడలతో, 12-15 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉండాలి.

పూలు నవంబర్ మరియు డిసెంబర్ సమయంలో కోతకు సిద్ధమవుతాయి. ఒక పంట కాలంలో 10-15 సార్లు పూల కోత కొయ్యవచ్చు, ఒక ఎకరానికి దాదాపు 5-8 టన్నుల వరకు దిగుబడి పొందేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine