చాలామంది గుమ్మడికాయ గింజలు తినడానికి ఇష్టపడరు. గుమ్మడి గింజలు తినడం ద్వారా ఇతర సమస్యలు తలెత్తుతాయని పెద్దవారు తినకూడదని చెబుతుంటారు. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే గుమ్మడి గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తరచూ గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహాన్ని నివారించడం, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు గుమ్మడి గింజలలో దాగి ఉన్నాయి.
గుమ్మడి గింజలలో కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ గింజలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా గింజలలో ఉన్నటువంటి విటమిన్ ఏ, సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజెన్ గాయాలను నయం చేయడంలో దోహదపడతాయి.
ఎన్నో పోషకాలు కలిగినటువంటి గుమ్మడికాయ గింజలను తరచూ తీసుకోవడం వల్ల కొవ్వు నిక్షేపాలు, రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధించవచ్చు.ఇది కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో దోహద పడుతుంది.ఇక గుమ్మడికాయ గింజలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇది మధుమేహ నియంత్రణ చేయడానికి దోహదపడుతుంది. ఈ క్రమంలోనే గుమ్మడికాయ గుజ్జు, విత్తనాలను తరచూ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇవే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడానికి గుమ్మడి గింజలు ఎంత దోహదపడతాయని చెప్పవచ్చు.
Share your comments