సహజమైన సుఖప్రదమైన నిద్ర శారీరక, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు మారుతున్న జీవన విధానంలో పని ఒత్తిడి, రాత్రిళ్లు మేల్కొని ఎక్కువగా పనిచేయడం, ఆహారపు అలవాట్లు, అనారోగ్య కారణంగా చెప్పవచ్చు.ఇలా నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రలేమి సమస్యతో సతమతమయ్యే వారు ఎక్కువగా నిద్ర మాత్రలకు,మద్యపానానికి బానిసలుగా మారి మరిన్ని వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు.అలా కాకుండా సహజమైన,ప్రశాంతత కలిగిన సుఖమైన నిద్ర కోసం ప్రతిరోజు పడుకునే ముందు కొన్ని పిస్తాలను తినడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చునని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
సహజంగా మనకు నిద్ర పట్టడానికి మెదడులోని పీయూష గ్రంథి స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ కారణం. ఈ హార్మోన్ మోతాదులను బట్టి మన నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవారికి, టైమ్ జోన్లు మారిన వారికి డాక్టర్లు కృత్రిమ మెలటోనిన్ హార్మోన్ను సూచిస్తుంటారు. ఎక్కువ రోజులు కృత్రిమ హార్మోన్ను తీసుకోవడం మంచిది కాదు కాబట్టి సహజంగా మెలటోనిన్ ఎక్కువగా లభించే పిస్తాను ప్రతిరోజు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్యను అధిగమించవచ్చు.
Share your comments