కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మన రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉన్న వారికి కరోనా వైరస్ ముప్పు ఉండదని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కావున మన రోజువారీ ఆహారంలో రోగనిరోధక శక్తినిపెంచే చిరుధాన్యాలు,విటమిన్ సీ సమృద్ధిగా కలిగిన పళ్ళు, కూరగాయలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ సమృద్ధిగా ఎదుర్కొనవచ్చు.
ఉదయం లేవగానే ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగి మొలకెత్తిన గింజలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.తర్వాత మన శరీరానికి అవసరమైన వ్యాయామం,నడక వంటివి చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండి సూర్యరశ్మి వల్ల విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది.ఉదయం టిఫిన్లో రెండు ఇడ్లీలు,పెసరట్టు తీసుకుంటే ఇందులో వాడే పచ్చిమిర్చి, అల్లం వంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దాంతోపాటు ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగాలి.
మధ్యాహ్న భోజనంలో కొర్రలతో అన్నం, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, పప్పు, ఆకుకూర తీసుకోవాలి.ఒకవేళ నాన్ వెజ్ తినాల్సి వస్తే చేపలు మంచి ఆహారం. ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవాలి.అలాగే పెరుగు, సలాడ్ ఉండే విధంగా చూసుకోవాలి. సాయంత్రం గ్రీన్ లేదా బ్లాక్ టీ తాగాలి. స్నాక్స్ గా డ్రైఫ్రూట్స్ ను తీసుకోవచ్చు.రాత్రి భోజనంలో రాగి ముద్ద తినడం మంచిది. ఏదీ తీసుకున్నప్పటికీ బాగా ఉడికించి తినాలి. లేదంటే జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.ఈవిధంగా మన ఆహారంతో పాటు అదనంగా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొంది ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
Share your comments