ప్రస్తుతం ఈ కాలంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా మన ఆహార విషయాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలను కోల్పోతున్నాము. మన శరీరంలో రక్త కణాలు కీలకపాత్ర వహిస్తాయి.ఈ రక్త కణాలు మనం తీసుకునే శ్వాసక్రియలో ఆక్సిజన్ శరీర భాగాలకు పంపించి కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు తీసుకు వస్తాయి.
మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ సమృద్ధిగా లేనప్పుడు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. అయితే రక్తహీనత సమస్య వచ్చేటప్పుడు మనలో విభిన్న లక్షణాలు కనపడతాయి. ఈ రక్తహీనత సమస్యను మొదట్లో గుర్తించడం కొంచెం కష్టమే అయినప్పటికీ రానురాను ఈ ప్రభావం మనుషులపై కనబడుతుంది.
రక్తహీనత సమస్యతో బాధపడే వారిలో జ్ఞాపకశక్తి తగ్గటం, మాటలు సరిగా రాకపోవడం, గణితంలో సరైన ప్రావీణ్యం చూపించకపోవడం, ఆడుకున్న కొద్ది సమయానికి నీరసించి అలసిపోవడం, తరచూ తలనొప్పి సమస్యతో బాధపడటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడితే మన శరీరంలో ఐరన్ శాతం పూర్తిగా తగ్గిపోయిందని అర్థం.
ఈ విధమైనటువంటి రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే ఐరన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం,చిక్కుడు గింజలు వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ఐరన్ మన శరీరానికి అందుతుంది.
చిన్నపిల్లలలో ఈ విధమైనటువంటి రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది.చిన్న పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వటమే కాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి. ముఖ్యంగా మన శరీరంలో రక్త హీనత సమస్య రావడానికి గల కారణం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం, శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల ఐరన్ తగ్గిపోయి సమస్యకు దారితీస్తుందని చెప్పవచ్చు.
Share your comments