Health & Lifestyle

రోగ నిరోధక శక్తి పెంచే తిప్పతీగ

KJ Staff
KJ Staff
GILOY
GILOY

తిప్ప తీగ మన చుట్టు పక్కల కనిపిస్తుంటుంది. పల్లెటూళ్లలో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని అమృత, గడూచి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని ఆకులే కాదు.. కొమ్మలు కూడా ఆయుర్వేదిక్ గుణాలను కలిగి ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి.

తిప్ప తీగ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

* తిప్ప తీగను ఆయుర్వేద మూలికల్లోనే రాణిగా పిలుస్తారు. తిప్ప తీగ ఆకుల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్ వంటివి ఎక్కువగా ఉంటుంది. కొమ్మల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఆల్కలాయిడ్స్, లాక్టోన్స్ వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి.

* తిప్ప తీగ రక్తంలోని చక్కెర స్థాయులను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచి గ్లూకోజ్ ని రక్తం నుంచి బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇది హైపోగ్లైసిమిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా డయాబెటిస్ ని తగ్గిస్తుంది. తిప్ప తీగ జ్యూస్ ని నీళ్లలో ఈ ఆకులు వేసి మరిగించడం ద్వారా తయారుచేయవచ్చు.

* తిప్ప తీగ కడుపుకి సంబంధించిన సమస్యలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. గ్యాస్ సమస్య, మలబద్ధకం, అరుగుదల తగ్గడం వంటి ఇటీవల ఎక్కువగా వస్తున్న సమస్యలను ఇది తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు.. లాక్సేటివ్ ఏజెంట్ గా పనిచేసి విరేచనాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేసి బరువును కూడా పెరగకుండా కాపాడుతుంది.

* జ్వరం, జలుబు వంటివి తగ్గించేందుకు కూడా ఈ తిప్ప తీగను ఉపయోగిస్తారు. ఎక్కువ రోజులు జ్వరం మిమ్మల్ని బాధపెడుతుంటే తిప్ప తీగ ఆకుల డికాషన్ తయారుచేసి తాగాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి సమస్యలున్నప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.

* తిప్ప తీగలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. ఇది మెదడులోని ఎంజైమ్ వ్యవస్థను మాడ్యులేట్ చేస్తుంది. న్యూరాన్లను ఇది సంరక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

* ఈ ఆకులో గ్లుకురోనైడ్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఇందులోని అద్భుతమైన గుణాలు రక్తనాళాలు, ఎముకలను కూడా ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

* తిప్ప తీగను ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ గుణాలు ముడతలతో పాటు మచ్చలు, మొటిమలు, నల్లని వలయాలు వంటివి తగ్గుతాయి. ఇందుకోసం దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవడంతో పాటు ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు.

* ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందుకే ఇది జలుబు, తగ్గు, టాన్సిల్స్, ఆస్థమా వంటివన్నీ తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది.

* పచ్చ కామేర్ల సమస్య ఉన్నవారికి ఈ ఆకు రసం తాగడం వల్ల దాని నుంచి విముక్తి లభిస్తుంది. ఇందుకోసం తిప్ప తీగ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా పొడి రూపంలోనూ దీన్ని తీసుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి?

తిప్ప తీగను చాలా రకాలుగా తీసుకునే వీలుంటుంది. ఇందులో ఎక్కువమంది పాటించే పద్ధతి ఈ ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవడం.. దీన్ని తిప్ప తీగ రసం అంటారు. ఇలా కాకుండా ఆకులు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నీటిలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. లేదా తిప్ప తీగ ఆకులను నూరి గోలీ కాయ సైజులో ఉండల్లా చేసుకొని రోజూ తీసుకోవచ్చు. ఆయుర్వేద శాఖ వీటిని శంశమినివటి పేరుతో ఆయుర్వేద దుకాణాల్లో అమ్మకానికి కూడా ఉంచింది. వాటిని కొని ఉపయోగించవచ్చు.

పెంపకం ఇలా..

ఈ మొక్క పెంపకాన్ని జూన్, జులై నెలల్లో ప్రారంభించాలి. గింజలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టి పాలీ బ్యాగ్స్ లో నాటుకోవచ్చు. పది రోజుల్లో మొక్క మొలుస్తుంది. అలాగే పాలీ బ్యాగ్ లో నెల నుంచి 45 రోజుల పాటు పెంచుకొని ఆ తర్వాత ఆపై నేలలో నాటుకోవచ్చు. లేదంటే పెన్సిల్ మందంలో ఉన్న గట్టి కొమ్మలు బొడిపెలు ఉండేలా చూసుకొని నేలలో నాటుకోవాలి. ఈ బొడిపెల నుంచి కొత్త మొక్కలు వస్తాయి. ఇది పెరిగేందుకు తీగ పాకేలా కాస్త ప్రదేశం ఉండాలి.

ఎలా కాపాడాలంటే..

ఈ మొక్క ఎలాంటి వాతావరణంలో అయినా మొలుస్తుంది. ఏ నేలలో అయినా సులువుగా పెరుగుతుంది. అయితే నీటి వసతి కాస్త బాగుంటే సరిపోతుంది. అయితే మరీ ఎక్కువ నీళ్లు పోస్తే మాత్రం ఈ మొక్క తట్టుకోలేదు. ఈ మొక్కలను గింజలు లేదా కాండం కటింగ్స్ సాయంతో నాటుకోవచ్చు. ఎకరానికి 2500 కాండం ముక్కలు సరిపోతాయి. మూడు మీటర్ల వెడల్పు ఉండేలా చూసి వీటిని నాటుకోవాలి. వీటికి పైకి వెళ్లేందుకు సపోర్ట్ ఏర్పాటు చేయాలి. వీటిని నాటే ముందే నత్రజనిని పొలంలో వేసి నాటడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. దీనికి పెద్దగా పురుగు కూడా పట్టదు. నీళ్లు కూడా మరీ తరచూ పోయాల్సిన పనిలేదు. రోజుకోసారి లేదా రెండు రోజులకోసారి పోయవచ్చు. దీన్ని వర్షాధారిత పంటగా కూడా పండించుకోవచ్చు. కాస్త కాండం లావుగా మారిన తర్వాత కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. హెక్టారుకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. వీటిని ఔషధ సంస్థల వారు కొని మందులు తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు.

https://krishijagran.com/health-lifestyle/ayurvedic-herb-giloy-is-a-wonder-drug-for-diabetes-read-on-to-know-how-to-consume-it/

https://krishijagran.com/featured/scientific-cultivation-management-and-medicinal-uses-of-giloy/

Share your comments

Subscribe Magazine