సాధారణంగా గుమ్మడికాయ అంటే అది ఆహార పదార్థాలుగా భావించకుండా కేవలం గృహప్రవేశాల సమయంలోనూ, లేదా దిష్టి తీయడానికి మాత్రమే చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇందులో దాగి ఉన్న పోషక విలువలు,గుమ్మడి కాయ తినడం వల్ల కలిగే ఆహార ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఒక్కరు కూడా గుమ్మడికాయ తినకుండా ఉండరు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి వ్యాధులను అరికట్టడానికి గుమ్మడికాయ ఎంతో దోహదపడుతుంది. మరి గుమ్మడి కాయలో ఉండే ఆరోగ్యప్రయోజనాలు పోషక విలువలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం...
గుమ్మడి కాయలో విటమిన్ సి, ఇ, ఎ.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. అదేవిధంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి గుమ్మడికాయ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు, జలుబు వంటి అంటు వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి గుమ్మడి ఎంతో దోహదపడుతుంది. గుమ్మడికాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. దీని ద్వారా రక్తహీనత సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చు.
గుమ్మడికాయ గుజ్జు విత్తనాలలో విటమిన్ సి, బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో అంటువ్యాధులను ఎదుర్కొని తెల్ల రక్త కణాల సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు గుమ్మడి కాయలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యలను ఎదుర్కొని కంటిచూపును మెరుగుపరుస్తుంది. గుమ్మడి కాయ గుజ్జు ద్వారా మొహానికి మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలు, మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
Share your comments