రైతులు సీజన్ కు అనువైన పంటలను వేసుకున్నప్పుడే అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రతి సీజన్లోనూ విత్తనాల, ఎరువుల కొరత రైతులను వేధిస్తూనే ఉంటుంది.దీంతో రైతులు సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు పంటలకు అందించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు.ఫలితంగా రైతులతో పాటు ఉత్పత్తి చేసే కంపెనీలు ఆర్థికంగా నష్టపోతుంటాయి. ఈసమస్యకు చక్కటి పరిష్కారమార్గాన్ని చూపుడానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు దీనికోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను రూపొందించారు.
ప్రతి సీజన్లోనూ రైతులు ఎదుర్కొంటున్న విత్తనాలు,ఎరువుల కొరతను నివారించడానికి సీజన్‌కు తగ్గట్టుగా రైతుల అవసరాల మేరకు ఉత్పత్తి చేసి నేరుగా వారికే చేరవేసేందుకు వీలుగా బ్లాక్‌చైన్ సాంకేతికతను ఉపయోగించుకుని"ఇన్‌క్లూజివ్ గ్రోత్ చైన్" పేరిట వెబ్ అప్లికేషన్ తయారు చేశారు.ఇది పూర్తిగా రైతులు, ముడిసరకు సరఫరాదారులు, కొనుగోలుదారులతో అనుసంధానమై ఉంటుంది. హెచ్‌సీయూ మేనేజ్‌మెంట్ విభాగం ఆచార్యుడు ప్రొ.విజయభాస్కర్ మరిశెట్టి, మరో ఆచార్యురాలు ప్రొ.వర్ష మామిడి సంయుక్తంగా సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇందుకు సింక్రొనీ ఐటీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు అందించడం జరిగింది.
ఇప్పటికే ఇన్‌క్లూజివ్ గ్రోత్ చైన్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా ఈ నెల 15 నుంచి తమిళనాడులో అమల్లోకి తీసుకొచ్చారు. సమున్నతి సంస్థ భాగస్వామ్యంతో తమిళనాడులోని సీడ్స్ ఎఫ్‌పీవోలో అమలు చేస్తున్నారు. వచ్చే నెలలో తెలంగాణాలోని కామారెడ్డి జిల్లా రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడ ఇ-ఫ్రెష్ కంపెనీ రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్ అందించేందుకు ముందుకు రాగా పంట ఉత్పత్తుల కొనుగోలుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆసక్తి చూపించింది.
సాధారణంగా ఒక ప్రాంతంలో రైతులు కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసుకుంటారు. ఇందులోని సభ్యులు మరుసటి సీజన్‌కు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల వంటివి నేరుగా యాప్‌లో తమ మాతృభాషలోనే నమోదు చేసే వీలుంటుంది. ఎఫ్‌పీవో పరిధిలో ఉన్న రైతుల అవసరాలను క్రోడీకరించి సీజన్‌కు అవసరమైన మేరకు నేరుగా కంపెనీలకు ఆర్డర్ వెళుతుంది. తదనుగుణంగా కంపెనీలు ఉత్పత్తి చేస్తాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు కనుక తక్కువ ధరకే లభిస్తాయి.ఈ వేదికలో కొనుగోలుదారులే భాగస్వాములు కావడంతో నేరుగా పంటను వారికి విక్రయించే అవకాశం దక్కుతుంది. ఈ విధానం వల్ల రైతులు, విత్తనాలను, ఎరువులను ఉత్పత్తి చేసే కంపెనీలు నష్టపోయే అవకాశంను నివారించవచ్చు.
Share your comments