Animal Husbandry

పాడి పశువుల్లో పాలజ్వరం .. తీసుకోవాల్సిన నివారణ చర్యలు !

Srikanth B
Srikanth B
Milk fever in dairy cattle
Milk fever in dairy cattle

పాల జ్వరం అనగా పాల వల్ల వచ్చే జ్వరం కాదు, దీన్ని ఉత్పాదక వ్యాధి లేదా మెడబాలిక్ డిసార్డర్ గా పరిగణిస్తాము. సాధారణంగా అధిక పాల దిగుబడి నిచ్చే ఆవులు మరియు గేదెలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. పశువుల శరీరంలోని రక్తంలో కాల్షియం పరిమాణం ఆకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్తప్రసారంలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకాళ్ళ పడిపోవడం, ఆపస్మారకస్థితికి లోనై క్రమంగా మరణించడం జరుగుతుంది. సకాలంలో చికిత్స అందితే పశువులు బతికి బయటపడే అవకాశాలున్న ఈ పోషక లోపం కల వ్యాధిని ‘పాలజ్వరం’ అని వ్యవహరిస్తారు.

 

పాలజ్వరం ఎటువంటి పశువుల్లో వస్తుంది?

ఈ పాల జ్వరం పాడి పశువులు ఈనిన మొదటివారంలో, ముఖ్యంగా మొదటి 2-3 రోజుల్లో ఎక్కువగా సంభవిస్తుంది.  సాధారణంగా 5-10 సం.ల వయస్సున్న పాడిపశువుల్లో, 3–7 ఈతల మధ్యకాలంలో ఎక్కవగా సంభవిస్తుంది, ముఖ్యముగా  జెర్సీ, జఫార్ బాడి జాతి పశువులలో ఎక్కువగా ఉంటుంది.

పాలజ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి?

వ్యాధి లక్షణాలు మూడు దశలలో ఉంటాయి. మొదటి దశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరుకుతూ బెదురుచూపులతో చికాకుగా ఉండి, వణకుతూ కదల లేకుండా ఉంటాయి. వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి, ఆతర్వాత సాధారణ స్థాయి కంటే తగ్గి ఒల్లంతా చల్లబడుతుంది. రెండవ దశలో పశువులు సరిగ్గా నిలబడలేకపోతాయి. శ్వాస మరియు నాడిలో వేగం తగ్గి పశువులు కదలకుండా ఉంటాయి. ఈ స్థితిలో పాడి పశువులు తలను పొట్టపై డొక్కలో ఆనించి “S” ఆకారంలో ఉండి మగతగా పడుకుని ఉంటాయి, ఇది పాలజర్వం కేసుల్లో సాధారణంగా కనబడే ప్రత్యేక లక్షణం. వ్యాధి చివరిదశ (మూడవ దశ) లో శ్వాస, నాడివేగం పూర్తిగా పడిపోతుంది. పశువు ఒకవైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం మొదలగు లక్షణాలు కనబడతాయి. కండరాల వణకుతో, చలనం లేకుండా, అపస్మాకర స్థితిలోకి  వెళ్తాయి. వైద్యసదుపాయం సత్వరమే అందకపోతే పశువులు మరణిస్తాయి.

పాల జ్వరం ఎందుకు వస్తుంది?

పశువుల వంద మి.లీ.ల రక్తంలో కాల్షియం పరిమాణం 8-10.5 మి.గ్రా.లు ఉంటుంది. చూడి పశువులు, పాడిపశువులు, చూడి, అధిక పాల ఉత్పత్తి వల్ల కలిగే ఒత్తిడిలకు, శ్రమకు  లోనైనప్పుడు కాల్షియం 6-8 మి.గ్రా. లకు పడిపోయి పాలజ్వరం ప్రమాదం ఏర్పడుతుంది. పశువు గర్భముతో ఉన్నప్పుడు ఇచ్చే ఆహారములో కాల్షియం తక్కువగా ఉండడము, ఎక్కువగా వట్టి గడ్డి పెట్టడము, గర్భస్త పశువులో అజీర్తి సమస్య ఉన్నప్పుడు, పారాథైరాయిడ్ గ్రంథి పనిలోపం వల్ల ఎముకల్లో నిలువ ఉన్న కాల్షియం రక్తంలోకి త్వరగా అందకపోవడం, తద్వారా రక్తంలో కాల్షియం పరిమాణం తగ్గడం సంభవిస్తుంది. ఈనిన తర్వాత జున్నుపాల ద్వారా మరియు మామూలు పాల ద్వారా కాల్షియం ఎక్కువగా పోతుంది. ఆ సమయంలో ప్రేవుల నుండి కాల్షియం తగినంతగా పీల్చుకోలేనప్పుడు, ఎముకల నుండి తగినంతగా కాల్షియం భర్తీ కానందువల్ల, కాల్షియం శాతం సాధారణ స్థాయి కంటే తగ్గుతుంది. విటమిన్’డి’ లోపం, కాల్షియం, ఫాస్పరస్ నిష్పత్తిలో తేడా మొదలగు కారణాల వల్ల కూడా శరీరంలో కాల్షియం వినియోగం కుంటుపడుతుంది.అంతేగాక చల్లని వాతావరణము, ఎక్కువ దూరము పశువులను రవాణా చేయడము మరియు ఆక్సలేట్ లు కలిగిన గడ్డిని ఎక్కువగా పెట్టడము వలన శరీరములో కాల్షియం శాతము తగ్గుతుంది.

 

చికిత్స ఎలా చేయాలి?

పాలజ్వరం ఆలస్యం చేస్తే పశువు చనిపోవడం గాని, పడకజబ్బు (డౌనర్ కౌ సిండ్రోం)కు దారి తీయడం గాని జరుగుతుంది. పాలజ్వరం కేసులో రోగనిర్ధారణ కాగానే కాల్షియం  బోరోగ్లూకోనేట్ 25% ఇంజెక్షనును వెంటనే 400-800 మి.లీ. రక్తనాళాల్లోకి ఇప్పించడం ద్వారా 75 నుండి 85 శాతం పాడిపశువుల్ని రక్షించుకోవచ్చు అవసరమైతే 12 గంటల వ్యవధిలో మూడుసార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

పాలజ్వరం నివారణ ఎలా?

పాలజ్వరం వ్యాధి నివారణలో భాగంగా పాలిచ్చే పశువులు చూడిగా ఉన్నప్పుడు దాణాలో సరిపోవు పాళ్ళలో కాల్షియం ఉండేలా జాగ్రత్త వహించాలి. లెగ్యూం జాతి పశుగ్రాసాలు, పచ్చిమేత, ఎముకలపాడి, ఎండు చేపల్లో కాల్షియం అధికంగా లభ్యమవుతుంది. అలాగని అవసరానికి మించి కాల్షియం చూడిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల కూడా ఈనిన తర్వాత పాలజ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికశాతం ఫాస్పరస్, తక్కువ శాతం కాల్షియం (1:3 నిష్పత్తి)తో కూడిన దాణా పశువులు చూడిగా ఉన్న చివరి నెలలో ఇవ్వడం ద్వారా పారాథైరాయిడ్ గ్రంధి చురుకుగా పనిచేసి ఈనిన తర్వాత ‘పాలజ్వరం’ నివారించబడుతుంది. పశువులు ఈనే 24 గంటల ముందు, ఈనిన 10 నుండి 14 గంటల తర్వాత రోజుకు మూడుసార్లు 150 గ్రా.ల కాల్షియం తాగించడం ద్వారా పాలజ్వరం రాకుండా జాగ్రత్త పడవచ్చు. చూడి, పాడి పశువులు అనవసరపు ఉద్రేకతలకు గురికాకుండా చూడాలి. పశువులు ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుండి విటమిన్ ‘డి’ ఇంజక్షన్లు ఇప్పించడం శ్రేయస్కరం. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత ప్రారంభంలో, పాలు పూర్తిగా పితకకూడదు. పశువులకు తగిన వ్యాయామం కల్పించాలి. పశువులను చలినుండి సంరక్షించాలి. వ్యాధి నివారణకై అమ్మోనియం క్లోరైడ్ 25 గ్రా చొప్పున చూడి చివరి వారాల్లో అందిస్తూ, ఈనే సమయం చేరేటప్పటికి 100 గ్రా. ప్రతిరోజు అందివ్వాలి. మాక్స్ కాల్ జెల్ (నియోస్పార్క్ కంపెని) ట్యూబు, పశువు ఈనే ముందు ఒకటి, ఈనిన 6-12 గంటల తర్వాత మరొక మాక్స్ కాల్షియం ట్యూబు మందును నోటి ద్వారా తినిపించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 12 గంటలకు ఈ ట్యూబు మందు తినిపించడం ద్వారా పాలజ్వరం నివారించబడుతుంది. మెటబొలైట్ (విర్బాక్ కంపెనీ) పౌడర్ను చూడి పశువులకు చూడి చివరి 20 రోజులు రోజుకు 100 గ్రా చొప్పున తినిపిస్తే, కాల్షియం, భాస్వరం పశువులకంది, ఈనిన తరువాత “పాలజ్వరం” సమస్య రాకుండా వుంటుంది.

 

Authors

డాక్టర్ ఎన్. రాజన్న, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ & హెడ్, డాక్టర్ శశాంక్, సైంటిస్ట్ (వెటర్నరీ), డాక్టర్ సాయి కిరణ్ సైంటిస్ట్ (LIPMA) KVK, ప్రావిన్స్ మన్నూరు వరంగల్.

 

Share your comments

Subscribe Magazine