రైతులు వ్యవసాయ పంటల సాగుతో పాటు దాని అనుబంధ రంగాల చిరు పరిశ్రమలతో మంచి ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే వ్యవసాయ సాగుతో ఒక్కోసారి పంటలు సరిగ్గా పండక పోవడం, మెరుగైన పంట దిగుబడి వచ్చినా.. పండించిన పంటకు మార్కెట్ లో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే, చిన్న రైతులతో పాటు నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తూ.. అండగా నిలుస్తోంది సీమ పందుల పెంపకం.
సీమ పందుల పెంపకంతో రైతులు, నిరుద్యోగులు జీవనోపాధి పొందడంతో పాటు మంచి ఆదాయం సైతం చేకూరుతుందని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. అలాంటి సీమ పందులను ఎలా పెంచాలి? లాభసాటిగా పందుల పెంపకం ఉండాలంటే ఏం చేయాలో సంబంధిత నిపుణులు వెల్లడించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పందులు పెంపకం చేపట్టాలనుకునే వారు తమకు అనువుగా ఉంటే స్థలంలో షెడ్ ను నిర్మించుకోవాలి. ప్రస్తుతం పందుల పెంపకం కోసం దేశీయ రకాలతో పాటు విదేశీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మన పరిసరాలకు అనుగుణంగా ఉండే రకాలను పెంచడం వల్ల నష్టాలు బారినపడే అవకాశం ఉండదు. స్థానికంగా డిమాండ్ ఉన్న రకాలను పెంచడం లాభసాటిగా ఉంటుంది. తల్లీ పందులను తెచ్చుకునే ముందు వాటి ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో పాటు చనుమొలలు అధికంగా ఉంటే పిల్లల్నిబాగా సాకే అకాశమెక్కువ. కాబట్టి అలాంటి వాటిని తెచ్చుకోవాలి.
పిల్లల పొషణ/సంరక్షణ:
పందులు ఏడాదిలో రెండు ఈతలు ఇస్తాయి. ప్రతి ఈతలో దాదాపు 10 వరకు పిల్లలను పెడతాయి. పందులు తినే మూడు కిలోల ఆహారంతో దాదాపు రెండు కిలోల బరువు పెరుతాయి. కాబట్టి వీటిని సరైన విధంగా ఆహారం అందిస్తే తొందరగా పెరుగుతాయి. పోషణ బాగుంటే 8 నెలల్లోపే ఎదకొస్తాయి. కాబట్టి పోషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాణ ఖర్చులే వీటికి అధికంగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో ఏరేసిన కూరగాయలు, ఆహార వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను పందుల పోషణకు ఉపయోగించుకోవచ్చు. అలాగే, వీటికి ఆహారంగా వేయడానికి దాణా సైతం మార్కెట్లలో అందుబాటులో ఉంది. మనం తయారు చేసుకోవాలనుకుంటే దాణా మిశ్రమంలో 55 శాతం మొక్కజోన్న, 20 శాతం వేరుశనగ చెక్క, 15 శాతం గోధుమ పొట్టు, 8.5 శాతం చేపల పొడి, ఒక పాలు ఖనిజలవణ మిశ్రమం, అరపాలు ఉప్పు కలిపి తయారు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎండలు, వేడిమిని తట్టుకునే శక్తి వీటికి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభావం పందులపై పడకుండా షెడ్లలో ఒక మూలన తక్కువ లోతు నీటి తొట్లను ఏర్పాటు చేసుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. పందుల్లో వచ్చే పాండురోగ నివారణ కోసం ఐరస్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
Share your comments