అధికంగా వాడుతున్న పురుగుమందులు మరియు రసాయన ఎరువుల మూలంగా భూమి గొడ్డుబారిపోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో భూమి పంటలు పండించడానికి పనికిరాకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితిలో సేంద్రియ వ్యవసాయం మానవాళిలో కొత్త ఆశలు చిగురింప చేస్తుంది. అయితే అసలేంటి ఈ సేంద్రియ వ్యవసాయం అన్న ఆలోచన మీ అందరికి వచ్చి ఉంటుంది.
సేంద్రియ వ్యవసాయం (Organic Farming) అనేది రసాయనాల, కృత్రిమ ఎరువుల, కీటకనాశకాలు, వంటి రసాయన పదార్థాల వాడకాన్ని తగ్గించి, ప్రకృతిలో లభించే జీవావరణ మార్పులను ఉపయోగించి పంటలను పెంచడాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతిలో సేంద్రియ ఎరువులు, జాతీయ వనరుల ఉపయోగం, మరియు మట్టిలో జీవాల వైవిధ్యాన్ని పెంచడంపై ఎక్కువ దృష్టి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం చెయ్యడం ద్వారా ఇప్పటివరకు మట్టికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసి, మట్టికి తిరిగి జీవాన్ని పొయ్యచ్చు. సేంద్రియ వ్యవసాయం చెయ్యడం ద్వారా కలిగే ప్రయోజనము ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన పంటలు:
రసాయన ఎరువులు మరియు మందులు ఎక్కువుగా వాడి పండించిన ఆహారం విషపూరితమైనది. ఇటువంటి ఆహారం తినడం వలన హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి అనేక రోగాలకు దారి తీస్తుంది. ఇటువంటి ఆహారంలో క్యాన్సర్ కలిగించే కారకాలు ఎక్కువగా ఉండటం మూలాన ప్రస్తుతం ఎంతోమంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీటికి ప్రత్యామ్న్యాయంగా సేంద్రీయంగా పండిన ఆహారం తినడం ఎంతో మంచిది. సేంద్రీయంగా పండిన ఆహారం, పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పర్యావరణ పరిరక్షణ:
రసాయన మందుల వినియోగం ఎక్కువవ్వడం వలన పర్యావరణం, గాలి, నీరు ఎంతో దెబ్బతిన్నాయి. విచ్చలవిడిగా మందులు వాడటంతో ఎన్నో వన్యప్రాణులు మరియు జలచరాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ నష్టాన్ని ఆపడం సేంద్రియ వ్యవసాయంతోనే సాధ్యం సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి, నీరు మరియు వాతావరణం రసాయన దుష్ప్రభావాల నుండి రక్షింపబడతాయి.
మట్టి ఆరోగ్యం:
మట్టి ఆరోగ్యంగా ఉండాలన్న, పంట బాగా ఎదిగి అధిక దిగుబడి సాధించాలన్న మట్టి మీదే ఆధారపడి ఉంటుంది. మట్టిలోని కొన్ని కోట్లాది జీవాలు మట్టికి జీవనాడి వంటివి. అయితే రసాయన మందులు మట్టిలోని జీవులపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. మట్టిలోని వైవిధ్యం తగ్గిపోతే మట్టి కూడా జీవం కోల్పొయినట్లే. సేంద్రియ పద్దతిలో వాడే పద్దతులన్నీ మట్టికి మేలు చేసేవే కానీ కీడు చేసేవి ఏమి లేవు,సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మట్టి జీవక్రియలు పెరగడంతో పాటు , జీవాల మనుగడ కూడా పెరుగుతుంది.
స్థిరత్వం:
ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగిస్తున్న పద్దతులన్నీ మట్టి అస్థిత్వాన్ని మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసేవే. స్థిరత్వం లేని వ్యవసాయం ఎక్కువ ఎక్కువా ఏళ్ల పాటు కొనసాగితే భూమిలోని అపూర్వమైన పోషకాలు మట్టి కోల్పోతుంది. దీనివలన రాబోయే తరాల అస్తిత్వం అస్తవ్యస్తంగా మారుతుంది. సేంద్రియ పద్ధతుల వలన పంటలు, వ్యవసాయం మరింత స్థిరంగా ఉంటాయి.
నిలకడగా ధరలు:
ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నవారి సంఖ్య చాలా తక్కువ. అయితే సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ నానాటికి పెరుగుతూనే ఉంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మంచి లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. సేంద్రియ ఉత్పత్తులకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ మంచి డిమాండ్ కాబట్టి వీటిని ఎగుమతి చేసి రైతులు అధిక లాభాలను పొందవచ్చు.
సేంద్రియ ఉట్పతులకు ఉన్న డిమాండ్ ఆధారంగా, రైతులకు నిలకడగా ఆదాయం వస్తుంది.
అయితే సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా ఆచరించాలి, అవసరమైం విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కంపోస్టు వాడకం:
పంట అవశేషాలను, పశువుల మాళ్లను, వృక్ష అవశేషాలను కంపోస్టు చేసి మట్టిలో కలిపి సేంద్రీయ ఎరువులుగా వాడడం ద్వారా ద్వారా నేలలో కర్బన శాతం పెరుగుతుంది. కంపోస్ట్ వాడటం ద్వారా పంటలకు అవసరమైన పోషకాల సమృద్ధిని లభిస్తాయి. దీనితోపాటుగా మట్టిలో జీవక్రియలు పెరుగుతాయి. మట్టిలో కర్బన శాతం పెరిగి మట్టిలో నీటి నిల్వశాతం పెరుగుతుంది. వీట్నితోపాటు కంపోస్ట్ ను పొలంలో దొరికే వాటితో సులభంగా తయారుచేసుకోవచ్చు కాబ్బటి తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్ధ్యం పొందవచ్చు.
పరిపుష్టి పంటలు:
మట్టిలో నైట్రోజన్ ను పెంచడానికి మరియు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కంపోస్ట్ తో పాటు పచ్చి పంటలు (జొన్న, అల్ఫాల్ఫా మొదలైన పంటలు ) పెంచి మొక్కలు పుష్పించే దశకు చేరుకున్న తరువాత వాటిని భూమిలో కప్పేయాలి. మొక్కల అవశేషాలు భూమిలో కుళ్ళి ఎన్నో రకాల పోషకాలను మరియు మట్టి యొక్క పంట దిగుబడి సామర్ధ్యం పెంచుతాయి. ఈ పద్ధతిలో మట్టిలో పోషకాలు పెరగడంతోపాటు, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలకు అవసరమైన కార్బన్ అందించి మట్టిలో నీటిని నిల్వ ఉంచి నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. పచ్చిరొట్ట ఎరువుల్లో నైట్రోజెన్ పుష్కలంగా ఉండటం వలన మట్టి ఆరోగ్యం పెంపొందించబడటంతో పాటు, తదుపరి పంటల దిగుబడులు కూడా పెరుగుతాయి.
జీవావరణ నియంత్రణ:
సేంద్రియ వ్యవసాయంలో చీడపురుగులు, రోగాలు నివారించడానికి సహజమైన చీడ పీడలు మరియు సేంద్రియ పద్దతిలో తయారుచేసిన మందులు వినియోగిస్తారు. దీనిలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే పద్దతులు ఏమి ఉండవు కాబట్టి ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను నిశ్చింత తినవచ్చు. రసాయనాలు మరియు కీటకనాశనులు వంటి వాటి అవసరం తగ్గి రైతులకు అదనపు వ్యయం తగ్గుతుంది. సహజసిద్దమైన నియంత్రణ విధానాలు వినియోగించడం ద్వారా పంటల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పొలంలో జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది.
నీటి పరిరక్షణ:
సేంద్రియ వ్యవసాయంలో నీటిని సమర్థంగా వాడటం చాలా ముఖ్యం. నీటి పరిరక్షణ పద్ధతులు ఎరువుల వినియోగాన్ని సమర్థంగా చేయడం ద్వారా పంటలకు మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం నీటిని వినియోగాన్ని తగ్గించి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం కల్పిస్తుంది. భూగర్భజలాలు వినియోగం తగ్గించి వర్షపు నీటిపై ఆధార పడటం ద్వారా భూగర్భ జలాలు నింపబడతాయి.
సేంద్రియ వ్యవసాయం పద్ధతులు ప్రకృతి, పర్యావరణం, మరియు పంటల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పద్ధతులను అంచనా వేసి, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మరియు సమాజానికి అనేక లాభాలు సమకూర్చవచ్చు.
Share your comments