కొర్రలు మన ఆహారంలో ఉపయోగించే ప్రధానమైన చిరుధాన్యం.దీన్ని భారతీయులు వేల సంవత్సరాలుగా సాగుచేస్తూ, వినియోగిస్తున్నారు.కొర్రలు ప్రధానంగా వర్షాధార ప్రాంతాలల్లో, తక్కువ పెట్టుబడితో,తక్కువ రసాయన మందులతో పండించుకోవచ్చు. వీటికి చీడపీడల ఉధృతి తక్కువ.ప్రస్తుతం కొర్రలు వినియోగం దేశంలో ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో కొర్రలను సాగు చేస్తున్న రైతులకు లాభాల పంట పండిస్తోంది.ఇలాంటి తరుణంలో రైతులు కొర్రల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించగలిగితే అధిక దిగుబడులు సాధించవచ్చు.
విత్తే సమయం, అనుకూలమైన నేలలు :
కొర్ర పంట అత్యధిక బెట్ట పరిస్థితులను తట్టుకోగలదు.ఖరీఫ్ సీజన్లో అయితే తొలకరి వర్షాలు పడిన వెంటనే జూన్ మొదటి వారం నుండి జూలై రెండవ వారంలోపు విత్తుకోవాలి. విత్తడం ఆలస్యమైతే అధిక తెగుళ్ళు సోకి పంట దిగుబడి ఆశించినంతగా ఉండదు.వేసవిలో అయితే కొర్రను జనవరి మాసంలో విత్తుకోవచ్చును. కొర్ర పంటకు తేలికపాటి ఎర్ర నేలలు చక్కటి అనుకూలం. నల్లరేగడి నేలల్లో కూడా వేసుకోవచ్చు అయితే మురుగు నీటి సౌకర్యం తప్పకుండా ఉండాలి.
విత్తన రకాల, విత్తే దూరం :
యస్ఐఎ 3085, యస్ఐఎ 3088(సూర్యనంది) యస్ఐఎ 3156 వంటి అధిక దిగుబడినిచ్చే కొర్ర రకాలు అందుబాటులో ఉన్నాయి.సాధారణంగా ఒక ఎకరానికి 1.5 నుంచి 2.0 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని సాళ్ళ మధ్య 22.5 సెం.మీ. ఎడంగాను మరియు సాళ్ళలో మొక్కల మధ్య 7.5 సెం.మీ. దూరం ఉండేట్లు గోర్రుతో విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం :
పొలాన్ని ఆఖరి దుక్కి చేసేటప్పుడు 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును ఎకరా పొలంలో వేసి కలియదున్నాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 24 కిలోల నత్రజని,12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.
కోర్ర సాగులో సస్యరక్షణ :
వెర్రికంకి తెగులు : కోర్ర పంటలో అధికంగా వచ్చే వ్యాధి వెర్రికంకి తెగులు. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు లేత మొక్కల ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. దీని నివారణకు కిలో విత్తనానికి 6.0 గ్రా.. మెటలాక్సిల్తో విత్తనశుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉన్నట్లయితే మెటలాక్సిల్ 8% + మాంకోజెబ్ 64% డబ్ల్యు. పి. 3.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే సరిపోతుంది.
గులాబీ రంగు పురుగు లేదా కాండం తొలుచు పురుగు: కోర్ర పంటలో ఈ పురుగు కాండాన్ని తొలిచి ఈ ఫైరుని నష్టపరుస్తాయి. ఈ పురుగు ఆశించినట్లయితే దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
త్రుప్పు మరియు అగ్గి తెగులు: ఈ తెగుళ్ళు ఆశించిన మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడును. ఈ తెగుళ్ళ ఎక్కువగా ఆశించినప్పుడు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా1గ్రా.కార్బండాజిమ్ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
Share your comments