గొర్రెల పెంపకంలో ఈ విషయాలు గుర్తించుకోవాలి.. గొర్రెల వసతి- వాటి పారిశుధ్యం, పౌష్టికాహారం- మంచినీరు, పుష్టికరమైన మేత, గొర్రెల జత కలుపు విధానం, జీవాల పోషణ పద్ధతులు.. సకాలంలో వ్యాధి నిరోధక చర్యలు, నాశి రకం గొర్రెల ఏరివేత - ఆరోగ్య పరిరక్షణ పైన పేర్కొన్న విషయాలను అసలు మర్చిపోవద్దు. ముఖ్యంగా గొర్రెలను గాలి, వెలుతురు బాగావచ్చే షెడ్లల్లో మాత్రమే పెంచాలి. ఇలాంటి షెడ్ల వలన అవి తిరగడానికి వీలుగా ఉంటుంది. తరువాత దాణా వేసే తొట్టి, నీటి తొట్టెలను అప్పుడప్పుడైనా పరిశుభ్రంగా కడుగుతుండాలి. కడిగినాక వాటికి సున్నం వేస్తే.. ఎక్కువ రోజులు శుభ్రంగా ఉంటాయి.
అలాగే గొర్రెలను రోజూ ఒకే పొలంలో అసలే మేపకూడదు. అలా మేపితే వాటికి సరైన పోషకాలు దొరకవు. మర్పిడి పద్ధతిలో పచ్చిక బయళ్ళలో వాటిని మేత కోసం తిప్పాలి. గొర్రెలు ఏలిక పాములు, జలగలు మొదలైన పురుగుల బారిన పడకుండా వాటికి మందులను వేస్తూ ఉండాలి. అలాగే గొర్రెలకు చిటుకు రోగం, జబ్బవాపు, గురకరోగం, గాలికుంటు, పారుడు లాంటి రోగాలు రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం సకాలంలో టీకాలను వేయించాలి.మీకు అందుబాటులో ఉన్న పశువైద్యుని సలహాలను ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిది.
పనికిరాని గొర్రెలను ఏరివేయడం.. ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతం గొర్రెలను ఏరివేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది కొత్తగా పుట్టే గొర్రెపిల్లలను పెంచుకోవాలి. అందులో ఆడగొర్రె పిల్లలను అన్నింటిని అట్టేపెట్టి ఉంచాలి. వయసు మీరిన, రోగిష్టిగా ఉన్నవాటికి చికిత్స చేయించాలి. బక్కచిక్కిన ఆడగొర్రెలను మందనుంచి వేరు చేయాలి. వాటిని వీలైనంత త్వరగా ఏరివేసి అమ్మేయాల్సి ఉంటుంది. అలాగే అవిటిగా పుట్టిన గొర్రెలను మందనుంచి ఏరివేసి అమ్మేయాల్సి ఉంటుంది. అలాగే అవిటిగా పుట్టిన పిల్లలను, పుట్టినప్పుడే బలహీనంగా ఉన్న వాటిని వెంటనే అమ్మేస్తే మంచిది. ఇక మగ గొర్రెపిల్లల్లోని విత్తనపు పొట్టేళ్ళు తప్ప మిగతావాటిని వాటికి మూడు నెలల వయసు రాగానే అమ్మేయడం మంచిది. లేదా వాటిని ఏడాదిపాటు బలంగా పెంచి మాంసానికి అమ్ముకోవచ్చు. 100 గొర్రెలకు 4 విత్తనపు పొట్టేళ్ళు ఉండాలి.
Share your comments