మన రాష్ట్రంలో బొప్పాయి సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మనం పాటించే యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను బట్టి బొప్పాయి మొక్కలు తొమ్మిది నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. బొప్పాయి సాగులో వైరస్, బ్యాక్టీరియా తెగుళ్ళు ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు.
సస్యరక్షణ చర్యలు:
పిండినల్లి : బొప్పాయిని ఆశించే చీడపీడలలో మఖ్యమైనది. తల్లి పిల్ల పురుగులు కాయల నుండి రసం పీల్చటం వలన కాయలు రంగు మారి, మార్కెట్ రేటు తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 మీ.లి. ప్రొపినోఫాస్ కలిపి కాయల మీద పిచికారీ చేయాలి. నులి పురుగులు సోకినా తోటల్లో మొక్కకు 250 గ్రాముల వేప పిండి, నులి పురుగు బెడద ఉన్న ప్రాంతాలలో ఒక్కొక్క మొక్కకు 250 గ్రాముల వేప పిండి, కార్బొఫ్యురాన్ 3జి గుళికలు 25-30
గ్రాములు, సుదొమొనాస్ ఫ్లోరిసెన్స్ 4 గ్రాముల చొప్పున ఒక్కొక్క మొక్కకు వేయాలి.
కాండం కుళ్ళు తెగులు : బొప్పాయి మొక్కలు లేత దశలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల
కాండం కుళ్ళు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుజేస్తుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొక్క మొదలు దగ్గర మందు మిశ్రమాన్ని పోస్తే సరిపోతుంది.
పండు ఈగ: బొప్పాయి కాయలు పక్వానికి వచ్చిన తరువాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణకు తోటలను ఎప్పటికప్పడు శుభ్రంగా వుంచుకోవాలి.మిథైల్ యుజినల్ ఎర బుట్టలను వుపయోగించి ఆకర్షింపబడిన మగ పురుగులను నాశనం చేయాలి.
రసం పీల్చే పురుగులు: రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక వంటి పురుగులు మొజాయిక్,రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళ వ్యాప్తికి కారణమవుతాయి. ఈ వైరస్ తెగులు అధికమైతే పంట నాణ్యత తగ్గి తీవ్రమైన ఆర్ధిక నష్టం కలుగుతుంది. రసం పీల్చే పురుగు ఉధృతిని గమనిస్తూ నివారణ చర్యలు తక్షణమే తీసుకోవాలి.తొలిదశలో లీటరు నీటికి 2 మీ.లి. ప్రొఫెనోపాస్ తరువాత దశలో 0.3 మీ. లి. ఇమిడాక్లోప్రేడ్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పురుగు ఆకర్షణ బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు పొలంలో ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Share your comments