Agripedia

సస్యగవ్యతో బంజరు భూమిలో సైతం బంగారం...

KJ Staff
KJ Staff

పురుగుమందులు మరియు రసాయన ఎరువుల వినియోగంతో మన దేశంలోని ఎంతో భూభాగం బంజరు భూమిగా మారుతోంది. ఇప్పటికే మన దేశంలో ఇప్పటికే 28.7% భూభాగం నిస్సారవంతమైంది. రసాయన ఎరువుల వినియోగం కొనసాగితే భవిష్యత్తులో మరింత భూభగం బంజరు భూమిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి రాళ్ళూరప్పలు మరియు సారంలేని భూమిని సైతం సేంద్రియ పద్దతులతో తయారుచేసిన సస్యగవ్యతో తిరిగి జీవం పొయ్యవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మన వేదాల్లో బంజరు భూమిని సైతం బంగారం పండించే విధంగా తయారుచేసే అనేక సాగు పద్దతులు పొందుపరచబడ్డాయి. రసాయన ఎరువుల వినియోగంతో దెబ్బతిన్న భూమిలో తిరిగి జీవం పొయ్యడానికి వినూత్నమైన ప్రకృతి సాగు పద్దతులను ఎన్నో పరిశోధన సంస్థలు ప్రయోగాత్మకంగా ఆచరిస్తున్నాయి. ఈ పద్దతిలో పండ్లు మరియు కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇందుకోసం సస్యగవ్యను ఉపయోగిస్తున్నారు. సస్యగవ్యతో సేద్యం చెయ్యడం ప్రారంభించిన తోలి ఏడాది నుండే పంట ఉత్పత్తి మరియి నేలలోని సారం ఘననీయంగా పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సస్యగవ్యతో వరుసగా నాలుగు సంవత్సరాలు సేద్యం చెయ్యడం ద్వారా సాగుకు అనుకూలం కానీ భూమి కూడా తిరిగి సారవంతమవుతుందని దీనిని పాటిస్తున్నవారు చెబుతున్నారు. 
సస్యగవ్య తయారీ:
సస్యగవ్య తయారీకి కలుపు మొక్కలే మూలం. కలుపు మొక్కలు పంటకు హానికరమని అనుకుంటాము. అయితే వీటిని పీకి ఆ పొలంలోనే పచ్చిరొట్ట ఎరువుగా మరియు సస్యగవ్య అనే ద్రవరూప ఎరువుగా వాడుతూ మంచి ఫలితాలు సాధించవచ్చు. సస్యగవ్య తయారీకి పొలంలోని కలుపుమొక్కలు మరియు గడ్డిని పికి, ఒక కిలో కలుపు మొక్కలకు కిలో ఆవు పేడ, ఒక లీటర్ ఆవు మూత్రం, మరియు రెండు లీటర్ల నీటిని ఫైబర్ పీపాల్లో కలిపి, పొలంలోని నీడన మాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజు ఉదయం మరియు సాయంత్రం కలియదిప్పుతుంటే 10-12 రోజుల్లోగా సస్యగవ్య సేంద్రియ ఎరువు సిద్దమవుతుంది. 

ఇలా తయారైన ద్రావణాన్ని1:1 పాళ్ళలో నీటిని కలిపి పొలంలోని ఆకులు అలమలు మరియు గడ్డి మీద పిచికారీ చెయ్యాలి. వారం రోజుల తరువాత ఈ గడ్డిని మరియు ఆకులను రోటవేటర్ సహాయంతో మట్టిలో కలియదున్నుకుని, మట్టిమీద సస్యగవ్య ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. తద్వారా సేంద్రియ పదార్ధం కుళ్ళి మట్టిలో కలిసిపోయి భూమిని సారవంతం చేస్తాయి.

రసాయన ఎరువుల వలన నిస్సారమైన భూమిని తిరిగి సారవంతం చెయ్యడంలో సస్యగవ్య మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఒక ఏడాదిలో మూడు సీసాన్లలో కొత్తగా మొలచిన కలుపు మొక్కలతో మాత్రమే సస్యగవ్యను తయారుచేస్తారు. రాళ్ళూ రప్పలతో కూడిన నేలల్లో కూడా, ఈ నేలకు అనుకూలమైన దానిమ్మ మొక్కలను నాటి వాటిపై సస్యగవ్యను వినియోగిస్తూ, మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ పద్దతి ద్వారా స్వల్ప ఖర్చుతోనే, బంజరు భూముల్లో సైతం బంగారం పండించడం సాధ్యమవుతుంది.

Share your comments

Subscribe Magazine