ఫల రారాజు మామిడి ప్రస్తుతం పిందెలు కాసే దశలో ఉంది. ఈ దశ మామిడి దిగుబడికి చాలా కీలకం కాబట్టి పిందెలు రాలకుండా కాపాడుకోవడం చాల అవసరం. సాధారణంగా ఒక పూరెమ్మకి 5 నుండి 6 పిందెలు కాస్తాయి కానీ వివిధ కారణాల వల్ల ఈ పిందెలు తొలి దశలోనే రాలిపోతున్నాయి చివరికి ఒక పూరెమ్మకి ఒకటి లేదా రెండు వరకు మిగిలిపోతున్నాయి ఫలితంగా తీవ్ర నష్టం చేకూరుతుంది. కాబట్టి దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిందెలు రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు:
*వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం
*పోషకాల లోపాలు.
*సాగు నీరు సరైన సమయానికి అందకపోవటం (నీటి ఎద్దటి)
*అధిక ఉష్ణోగ్రత
*హార్మోన్ల విడుదలలో సమతుల్యత లోపించటం
*మరియు పిందెలు ఏర్పడే దశలో పురుగుల/తెగుళ్ల తాకిడి ఉండటం.
నివారణ చర్యలు:
* పిందెలు చిన్న పరిణామంలో వున్నప్పుడు పది గ్రాముల యూరియాని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పిందెలు రాలడం ఆపవచ్చు.
*పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల పిందెలు రాలటం ఆగిపోయి వాటి నాణ్యత కూడా పెరుగుతుంది.
*పోటాష్ ఎరువులను వేపపిండిలో కలిపి చెట్లకు వేసుకోవాలి.
చీడ పీడల తాకిడిని అరికట్టడం: మామిడి పిందె దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, తేనెమంచు పురుగులు ,పండు ఈగలు, బూడిద తెగులు మరియు మచ్చల తెగులు వంటి వాటి తాకిడి ఎక్కువగా ఉంటుంది
*రసం పీల్చే పురుగులకు 2 మి.లీ ఫిప్రోనిల్ ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి .
*ప్రధానంగా తేనె మంచు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించడానికి 0.3 మీ.లీ ల ఇమిడాక్లోప్రిడ్ ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
*బూడిద తెగులు నివారణకు మూడు గ్రాముల గంధకాన్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి
*పండు ఈగలను అదుపులో పెట్టడానికి మిథైల్ యుజినాల్ ట్రాపులను తోటలో అక్కడక్కడ అమర్చుకోవాలి.
నీటి సరఫరా:
*పిందె దశలో వున్నప్పుడు రెండు వారాల వ్య్వవధిలో రెండు నుండి మూడు దాకా నీటి తడులు ఇవ్వాలి తద్వారా సత్పలితాలు ఉంటాయి .
అంతే కాకుండా 10 మీ.లీ (NAA ) నాప్తలీన్ అసిటిక్ ఆసిడ్ ని 50 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పిందెలు రాలడాన్ని అరికట్టవచ్చు.
ఇంకా చదవండి
Share your comments