మన రాష్ట్రంలో దానిమ్మ తోటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నాణ్యమైన దానిమ్మ కాయలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తూ మంచి ఫలసాయాన్ని పొందుతున్నారు. దానిమ్మ సాగుకు నీటి వినియోగం చాలా తక్కువ. అందుకే అవసరమైన మేరకే నీరు అందించాలి. ఎక్కువ నీరు అందిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా,వైరస్ వ్యాధి ఉధృతమవుతుంది. దాంతో కాయ దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దానిమ్మ తోటలు పూత, పిందె, కాయ దశల్లో ఉన్నాయి.దానిమ్మ ఏడాది పొడవునా కాపునిస్తుంది. కానీ దీని వలన దిగుబడులు తగ్గడమే కాక సాగు ఖర్చు కూడా పెరుగుతుంది. అందువలన మార్కెట్ డిమాండ్, సాగునీటి లభ్యత, నేలస్వభావం, చీడపీడలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాపును తోటల్లో నిలుపు కుంటే రైతులు అధిక లాభాలను పొందేఅవకాశం ఉంది.
సాధారణంగా దానిమ్మ మూడు సీజన్లలో పూతనిస్తుంది. ఈ సీజన్లను వివిధ పేర్లతో పిలుస్తారు.జనవరి, ఫిబ్రవరి మాసాలలో వచ్చే పూతను బహార్ అని, జూన్ జూలైలలో వచ్చే పూతను హస్తబహార్ అంటారు. సాధారణంగా అంబేఐహార్, మిగ్బహార్ లో పూత ఎక్కువగా వస్తుంది. కానీ ఏదో ఒక సీజన్లో కాపును తీసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కాపు నియంత్రణ ముఖ్య ఉద్దేశ్యం చెట్లకు రెస్ట్ ఇచ్చి వాడు తెప్పించడం,చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి వేర్లను కత్తిరించడం,వేర్లను బహిర్గతం చేయడం, నీటినివ్వకుండా ఎందుబెట్టడం వంటి పద్ధతులను ఆచరించాలి.
జనవరి ఫిబ్రవరి మాసాలలో పూతనిచ్చే హస్తబహార్ కాపుకోసం జూన్ నెలనుండి నీటి తడులివ్వడం ఆపాలి. జూన్ నెలలో వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట తీయడం కొంచెం కష్టంతోకూడుకున్నది. సెప్టెంబరులో చెట్లు బేట్టకు గురైనప్పుడు కొమ్మలు కత్తిరించి ఎరువులు వేసి నీరు పెడితే అక్టోబర్ మాసంలో పూతకు వచ్చి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కాయ కోతకు సిద్ధమవుతుంది. దానిమ్మలో కాయ నాణ్యత, సైజు పెంచడానికి తప్పనిసరిగా పూత కాయలను పలుచన చేయాలి.6 సంవత్సరాల వరకు 30-50 కాయలు,ఆపైన 60 కాయలవరకు ఉండవచ్చు.
కొన్ని రసాయనాలు వాడటం ద్వారా పూత, పిందె రాలునట్లు చేయవచ్చు. ఇథేఫాన్ 2000 పిపిఎమ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పూత, పిందె రాలేటట్లు చేయవచ్చు.అయితే రసాయనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. మోతాదుకు మించి వాడినట్లయితే పూత మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి దానిమ్మ సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి సరైన సమయానికి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక నాణ్యమైన దిగుబడులు సాధించ వచ్చు.
Share your comments