పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తుండటంతో చాలా మంది రైతులు, నిరుద్యోగ యువతీ యువకులు పుట్టగొడుగుల పెంపకం చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకంలో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను( స్పాన్) తయారు చేసుకోవడం చాలా అవసరం. పుట్టగొడుగుల పెంపకంలో కీలకమైన స్పాన్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
మొదట నాణ్యమైన జొన్నలు లేదా గోధుమ విత్తనాలను తీసుకొని అంతే పరిమాణం గల మంచి నీటిలో దాదాపు 30 నిమిషాలు పాటు ఉడకబెట్టాలి.తర్వాత బాగా ఉడికిన1 కిలో గ్రా. జొన్న లేదా గోధుమ గింజలకు 20గ్రా. కాల్షియం
కార్బనేట్ మరియు 5 గ్రా. కాల్షియం సల్ఫేట్ మందు పొడిని అన్ని గింజలకు సమానంగా అంటుకునే విధంగా పట్టించాలి. జొన్నలకు కాల్షియం కార్బనేట్ కలపటం వలన ఉదజని(ph) 7 శాతం ఉండి పుట్టగొడుగుల శిలీంధ్రము ఆరోగ్యంగా,త్వరిత గతిన పెరగటానికి ఉపయోగపడుతుంది .
ఇలా తయారుచేసుకున్న గింజల మిశ్రమాన్ని శుభ్రపరిచిన గ్లూకోజు సీసాలు లేదా 400 గేజ్ మందము గల పాలీప్రొపిలిన్ కవర్లలో 3/4 వంతు వరకు నింపాలి. సీసాలకు నీరు పీల్చని దూదిని గట్టిగా మూతికి పెట్టాలి. సీసాలపై కాగితపు ముక్క లేదా అల్యూమినియం ఫోయిల్ దూదిపై ఉంచి సీసాల మూతికి రబ్బరుబ్యాండ్లు పెట్టాలి. ఇలా తయారు చేసిన సీసాలను ఆటోక్లేవ్లో 15 పౌండ్ల పీడనం వద్ద 1 గంటల పాటు వుంచి తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద 24 గంటల పాటు చల్లర్చాలి.
ఇలా తయారుచేసుకున్న విత్తనాల్లకి మదర్ కల్చర్ ను ఇనాక్యులేషన్ చేసేముందు గదిలో అతినీలలోహిత దీపం వద్ద 30 నిమిషాలు ఉంచితే సూక్ష్మజీవులన్ని చనిపోతాయి.స్పిరిట్ దీపం వద్ద పుట్టగొడుగు మదర్ కల్చర్ ను సీసాలోనికి కొద్దిగా వేసిన వెంటనే శుభ్రమైన దూదితో మూసివేయాలి. ఇనాక్యులేషన్ చేసిన సీసాలను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ 15 రోజుల పాటు నిల్వవుంచినట్లయితే పుట్టగొడుగుల మైసీలియం పెరిగి స్పాన్ తయారు అవుతుంది.
స్పాన్ సీసాలోని గింజల చుట్టూ తెల్లగా సిల్క్ లాగా ఉంటే అది స్వచ్ఛమైన తాజా విత్తనం.
స్పాన్ ను వాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే గోధుమ మరియు పసుపు వర్ణము గా మారి నీరు చేరుతుంది. అలానే స్పాన్ సీసాలో ఆకుపచ్చ, నల్లని బూజు ఉంటే ఆ సీసాలను తీసివేయాలి లేకపోతే వాటి వలన బెడ్స్ పాడయ్యే అవకాశము చాల ఎక్కువ.
పుట్టగొడుగుల విత్తనాన్ని 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.ఒకసారి స్పాన్ బాటిల్ మూత తెరిచిన తర్వాత స్పాన్ మొత్తమును ఉపయోగించాలి .
Share your comments