Agripedia

విశాఖ కాఫీ తోటల్లో మిరియాల సాగు.. ఎలా చేస్తున్నారంటే?

KJ Staff
KJ Staff

మిరియాల సాగుకు కేరళ రాష్ట్రం పెట్టిందిపేరు అని చెప్పవచ్చు. కేరళ రాష్ట్రంలోని సాగుచేసే మిరియాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది.అయితే కేరళ రాష్ట్రంలో సాగు చేసే మిరియాల పంటను తలదన్నే విధంగా విశాఖ మన్యంలో గిరిజన రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. కేవలం దిగుబడిలో మాత్రమే కాకుండా నాణ్యతలోను విశాఖ మన్యం కేరళ మిరియాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఎలాంటి క్రిమిసంహారక మందులు లేకుండా పైసా పెట్టుబడి లేకుండా అధిక ఆదాయాన్ని మన్యం గిరిజన రైతులు ఆర్జిస్తున్నారు.

విశాఖ మన్యం ప్రాంతాలలో కాఫీ తోటలను ఎంతో విరివిగా సాగు చేస్తున్నారు. ఈ కాఫీ తోటల్లో అంతర పంటలుగా మిరియాల పంటను సాగు చేస్తూ ప్రతి ఏటా 150 కోట్ల రూపాయలు వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక్కడ సాగు చేస్తున్నటువంటి కాఫీ తోటలు వాటి కాపుని బట్టి ఎకరానికి 25 నుంచి 40 వేల ఆదాయం వస్తే కాఫీ తోటల్లో అంతర పంటగా వేస్తున్నటువంటి మిరియాల పంటకు ఎకరానికి 40 వేల నుంచి 60 వేల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది.

మిరియాల పంటను సాగు చేయాలంటే తగినంత నీడ, నీరు ఎంతో అవసరం. ఈ పంట సాగు కోసం నీరు నిలవడానికి ఏటవాలు భూములు ఎంతో అవసరమవుతాయి. ఈ మిరియాల చెట్టపొద్దులు 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి కనుక వీటిని ఆసరాగా ఉంచడం కోసం మరొక చెట్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రాంతంలో కాఫీ చెట్లకు నీడ ఉండటం కోసం సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతారు. ఓక్ చెట్టు మొదలులో మిరియాలు నాటుతూ వాటిని తీగలుగా ఈ ఓక్ చెట్లకు ఆసరాగా వేస్తారు.

మిరియాల పంటను ఒకసారి వేస్తే రెండు సంవత్సరాలకు కాపు వస్తుంది. ఈ పంట జనవరి నుంచి ఏప్రిల్ మే మధ్యలో చేతికి వస్తుంది.ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు – 1 అనే రకాల మిరియాలను పండిస్తున్నారు. 3.2కిలోల పచ్చి మిరియాలను ఎండ పెడితే కిలో మిరియాలు తయారవుతాయని కిలో మిరియాల ధర 300 నుంచి 400 వరకు పలుకుతుందని,ఈ గ్రామీణ రైతులు పైసా పెట్టుబడి లేకుండా అధిక మొత్తంలో అంతర పంట ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine