హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల దాదాపు అన్ని పంటలూ దెబ్బతిన్నప్పటికీ.. ఆయిల్ పామ్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు జిల్లాల వారీగా అధ్యయనం చేయగా ఆయిల్ పామ్ కు సంబంధించి నష్టం వివరాలు నమోదు కాలేదు. ఆయిల్ పామ్ లో వేసిన అంతర పంటలు దెబ్బతిన్నప్పటికీ ఆయిల్ పామ్ కు ఏమి కాలేదని అధికారులు గుర్తించారు. గత మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. మొదట్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఆయిల్ పామ్ ను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆ జిల్లాల్లో నాటిన మొక్కలు ఇప్పటికే ఆరడుగుల కంటే ఎత్తు పెరిగాయి. రెండేళ్ల కిందట ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నాటిన మొక్కలు నాలుగడుగులు పైగా పెరిగాయి.
రాష్ట్రంలో పామాయిల్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 3 లక్షల ఎకరాలు, 2023-24లో 7 లక్షల ఎకరాలు, 2024-25లో 10 లక్షల ఎకరాలలో మొత్తంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాల్లో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్లతో పాటు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు నిరంతరం ఆదాయం పొందవచ్చునని జిల్లాల్లోని వ్యవసాయ అధికారులు వివరించడంతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్నారు.
ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. టన్ను పామాయిల్ గెలలకు రూ.13 వేల నుండి రూ. 15 వేల ధర పలుకుందని అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చని అధికారులు సూచించడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈదురు గాలులు, వడగళ్లకు తట్టుకుని ఆయిల్ పామ్ నిలబడుతుందని కూడా అధికారులు వివరిస్తున్నారు. అంతర్జాతీయంగా మలేషియా వంటి దేశాల నుంచి పామాయిల్ దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో స్థానికంగా ఆయిల్ పామ్ సాగుకు డిమాండ్ పెరిగింది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం కూడా మరో కారణంగా తెలుస్తుంది.
అకాల వర్షాల కారణంగా.. మూడు రాష్ట్రాల్లో 5.23 లక్షల హెక్టార్ల పంట నష్టం
అయితే ఆయిల్ పామ్ పంట వేసిన మొదటి మూడు సంవత్సరాలలో ఎలాంటి లాభాలు ఉండకపోవడం రైతులను కొంత ఆందోళకు గురిచేస్తుంది. మరి మూడేళ్లపాటు వేచి ఉండడం వల్ల తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతాయనేది చాలా మంది రైతులలో ఉన్న భావన. మరోవైపు ప్రభుత్వం లక్ష్యం పెద్దగా ఉన్నప్పటికీ.. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం అందించే రాయితీ మాత్రం అంతగా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇది కూడా ఆయిల్ పామ్ సాగుకు రైతులు వెనక అడుగు వేయడానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఆయిల్ ఫామ్ పంట రక్షణకు కేంద్ర ప్రభుత్వ ఆయిల్ ఫెడ్ చట్టం ఉంది. ఏదైన తెగుళ్లు సోకి పంట నష్టపోతే కేంద్ర చట్టం ద్వారా రైతులు నష్టపరిహారం పొందవచ్చు. చట్టం పై రైతులకు అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమని, రాష్ట, కేంద్ర ప్రభుత్వాల సమన్వయం కొరవడం కూడా ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెరగకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది.
Share your comments