వాణిజ్య పంటల్లో మిరపదే ప్రధాన స్థానం. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అతి పెద్ద మిరప ఉట్పతిదారుగా నిలిచింది. దేశం మొత్తం మీద 50% మిరప ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుండే వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు మిరప సాగుకు పెట్టింది పేరు, ఇక్కడ పాండే మిరపకు దేశం మొత్తం అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నీటి వసతి బాగా ఉన్న, నల్ల రేగడి నెలలున్న ప్రాంతాలు మిరప సాగుకు అనుకూలం. మిరప పంటను సాగు చెయ్యడానికి ఉష్ణోగ్రత 15-35 ℃ మధ్యన ఉంటే సాగుకు అనుకూలిస్తుంది.
మిరపపంటలో అనేక రకాల చీడపీడలు ఆశించి, రైతులకు ఎంతో నష్టం కలిగిస్తాయి. ఎక్కువ కాలం సాగయ్యే పంట కాబట్టి, రైతులు తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిరపసాగులో బాక్టీరియా తెగులు సమస్య అధికంగా ఉంటుంది. మిరపకొమ్మలకు సోకె కొమ్మ కుళ్ళు తెగులు సాగుకు ప్రధానమైన ప్రతిబంధకంగా మారింది. ఈ తెగులు సోకిన కొమ్మల ఆకులు మొదట మాడిపోయి క్రమేణ రాలిపోతాయి. అంతేకాకుండా ఆకులు మాడిపోయిన కొమ్మల కణుపుల మధ్య కూలిపోయినట్లు కనిపిస్తుంది. ఈ తెగులును గుర్తించిన వెంటనే నివారించకుంటే మిగిలిన మొక్కలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ బాక్టీరియా తెగులును నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.
మిరపలో మరొక్క పెద్ద ప్రతిబంధకంగా ఆకు మచ్చ తెగులును చెప్పవచ్చు. తేమ ఎక్కువగా ఉండి, అధిక వర్షాల సమయంలో మొక్కలకు ఆకు మచ్చ తెగులు సోకుతుంది. మొదట ఆకుల మీద ఎండిన మచ్చలు ఏర్పడతాయి, క్రమంగా ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీనిని నివారణకు రైతులు ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, 1 గ్రాము స్ట్రెఫ్టోసైక్లిన్ లేదా 2గ్రాముల పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకుంటే ఆకుమచ్చ తెగులును నివారించుకోవచ్చు.
ఇక పురుగుల విషయానికి వస్తే పేనుబంక మిరపలో తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు ఆకులు మరియు కొమ్మల్లోని రసాన్ని పీల్చి దిగుబడి తగ్గేలా చేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే, ఎసిఫెట్ 1.5గ్రాముల లేదా, మిథైల్ డెమటాన్ 2మిల్లీలీటరు, లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.25మిల్లీలీటరు చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పేనుబంకతో పాటు తెల్లదోమ కూడా మిరపను ఆశించే పురుగు. తెల్లదోమలు మిరపలో వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందేలా చేస్తాయి. తెల్లదోమలను నివారించడానికి పొలం మొత్తం జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉదృతి ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఇమిడిక్లోరోఫిడ్ 2.5 మిల్లిలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. తెల్లదోమను నివారిస్తే వైరస్ తెగులును కూడా నివారించగలిగినట్లే.
మిర్చిని ఆశించే మరొక్క ప్రధానమైన తెగుళ్లలో కాయకుళ్ళు తెగులు ఒకటి. ఈ తెగులు సోకిన కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి, అవి క్రమంగా గోధుమ రంగు మచ్చలుగా మారి, ఎండిపోయి రాలిపోతాయి. కాయలు రాలిపోవడం, లేదా మార్కెటింగ్ చెయ్యడానికి పనికిరాకుండా పోవడంతో, దిగుబడి మరియు ఆదాయం తగ్గిపోతాయి. దీని నివారణకు క్లోరాంట్రానిల్ 2మిల్లీలీటర్లు, మాంకోజెబ్ 2.5 గ్రాములు విత్తనంలో కలిపి శుద్ధి చేసుకుంటే ఈ తెగులు రాకుండా మొక్కలను రక్షించుకోవచ్చు.
వీటితోపాటు, కొన్ని వైరస్ తెగుళ్లు కూడా మిర్చిలో నష్టం కలిగిస్తాయి. వైరస్ వ్యాప్తి చెందాడనికి రసం పీల్చే పురుగులు కారణం కావచ్చు. మొక్కలను పురుగులు ఆశించకుండా రక్షించగలిగితే, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. పొలం చుట్టూ, కంచె పంటలుగా మొక్కజొన్నను నాటడం వలన వైరస్ తెగులును చాలా వరకు నియంత్రించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వైరస్ తెగులును సమర్ధవంతంగా నియంత్రించగలిగే రకాలు అందుబాటులోకి వచ్చాయి, రైతులు వీటిని వినియోగిస్తే మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది
Share your comments