దేశంలో సాగుచేస్తున్న ఆహార పంటల తర్వాత నూనెగింజల సాగులో వేరుశెనగ పంటకు ప్రముఖ స్థానం ఉంది. దేశంలో ఈ పంటను ఖరీప్, రబీ రెండు సీజన్లలో సాగుచేస్తున్నారు. అందులో 90% పంటను కేవలం వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే ఆగస్ట్15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వేరుశెనగలో సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా సూక్ష్మపోషక లోపాలను సవరిస్తే కాయ నాణ్యత పెరిగి అధిక లాభాలను పొందవచ్చు.
వేరుశనగ సాగులో సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు ,నివారణ చర్యలు:
జింక్ : జింక్ లోపించిన పైరు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కన్పిస్తాయి. మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల ఈనెల మధ్య పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించుటకు ఎకరాకు 400 గ్రా॥ల చొప్పున జింక్ సల్ఫేట్ 200 లీ॥ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారి చేయాలి. జింక్ లోపం కన్పించే నేలల్లో 3 పంటలకొకసారి ఎకరాకు 10 కిలోల వర్షాధారంగా, నీటి పారుదల క్రింద 20 కిలోల జింక్ సల్ఫేట్ను నేలకు వేయాలి. నేలలో జింక్ 0.6 పి.పి.యమ్. కన్నా తక్కువగా వున్న చోట్ల జింక్ సల్ఫేట్ రూపంలో వేయవచ్చును.
బోరాన్ : నీటిపారుదల క్రింద వేసే పంటకు ఎకరాకు 4 కిలోల బోరాక్సున్న విత్తేటపుడు వేయాలి. బోరాన్ గింజల అభివృద్ధికి అవసరం. బోరాను 25 పి.పి.యం కన్నా తక్కువగా వున్న నేలల్లో వాడవలసిన అవసరం వుంది.
ఇనుము : ఇనుము ధాతు లోపం నల్లరేగడి నేలల్లో అధిక తేమ వున్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగాను తర్వాత తెల్లగా మారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 1 కిలో అన్నభేది, 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
కాల్షియం అంశం అధికముగా వున్న నల్లరేగడి నేలల్లో, ఉదజని సూచిక 7.5 కన్నా ఎక్కువ వున్న నేలల్లో ఇనుము ధాతు లోపం ఎక్కువ.
Share your comments