వ్యవసాయంలో ప్రధాన సమస్యగా మారిన కూలీల కొరత, అధిక పెట్టుబడి మొదలగు సమస్యలను అధిగమించడానికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే యంత్రాలను తక్కువ ఖర్చుతో తయారు చేసి అద్భుతాన్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కల్లపల్లి బేలూరుకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి డి.ప్రతాప్ ఆరునెలలు కష్టపడి తనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఎరువులను, విత్తనాలను ఒకేసారి విత్తే పరికరాన్ని తయారు చేశాడు.
ఈ పరికరాన్ని ఉపయోగించి పత్తి, మొక్కజొన్న
పంటలను ఒకేసారి రెండుసాళ్లు. పెసర, కంది
లాంటి పంటలయితే ఒకేసారి మూడుసాళ్లలో వేయవచ్చంటున్నారు. ఈ పరికరం సహాయంతో ఒక వ్యక్తి ఒక రోజులో తక్కువ ఖర్చుతో 4 ఎకరాల్లో పని పూర్తి చేయడానికి అవకాశం ఉంది, ఈ పరికరాన్ని తయారు చేయడానికి కేవలం నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అలాగే ఈ పరికరం ద్వారా రైతులకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతాప్ చెబుతున్నాడు.
అలాగే ఇంకో ఇంజనీరింగ్ విద్యార్థి మనూరు మండలం బోరంచకు చెందిన కొంగరి దీపక్‌రెడ్డి రాళ్ల పొలాల్లో రాళ్లను సులభంగా ఏరేసేలా యంత్రాన్ని రూపొందించి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.ఈ యంత్రం నేలపై మట్టిని తోడుతూ అందులోని రాళ్లను సేకరిస్తుంది. తిరిగి మట్టిని యథావిధిగా అక్కడే వదిలేస్తుంది. ఇదే యంత్రాన్ని ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను నేలలో నుంచి తీయడానికి ఉపయోగించేలా తీర్చిదిద్దుతున్నట్లు దీపక్‌రెడ్డి వివరించారు. నాలుగు గంటల్లో ఎకరా విస్తీర్ణంలోని రాళ్లను సులభంగా తక్కువ ఖర్చుతో ఏరివేయడం ఈ యంత్రం ప్రత్యేకత అని చెప్తున్నాడు.
ప్రస్తుతం దీనిని మల్టీపర్పస్ హార్వెస్టర్ అని పిలుస్తున్నారు.పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చేసరికి ఈ యంత్రం రెండున్నర లక్షలకు దొరికే అవకాశముంది త్వరలోనే వాటిని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.తాజాగా వీరిద్దరూ తయారుచేసిన నూతన ఆవిష్కరణలు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా స్థాయిలో ఎంపిక కావడంతో జిల్లా ప్రజలు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Share your comments