నూనె గింజల సాగులో వేరుశెనగ తరవాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పొద్దుతిరుగుడు. పొద్దుతిరుగుడు పంటను అన్ని కాళ్ళలోనూ సాగు చెయ్యవచ్చు. తక్కువపెట్టుబడి మరియు తక్కువ కాలపరిమితి కలిగిన పంట కాబట్టి ఎంతో మంది రైతులు దీనిని సాగు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. పంట మార్పిడి చెయ్యాలనుకునే రైతులకు పొద్దుతిరుగుడు ఎంతో అనుకూలం. తక్కువ నీరు మరియు కొద్దిపాటి పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.
అయితే పొద్దుతిరుగుడు ను సాగు చేసే రైతులు ఎన్నో రకాల చీడపీడల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువుగా ప్రాంతాల్లో చీడపీడల సమస్యలు ఎక్కువుగా ఉంటాయి. కొద్దిపాటి యజమాన్య పద్దతులు పాటిస్తే రెట్టింపు లాభాలు పొందవచ్చి అధికారులు సూచిస్తున్నారు. చీడపీడల ఉదృతి తగ్గించడానికి ఎటువంటి యాజమాన్య పద్దతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొద్దుతిరుగుడు సాగులో అనేక రకాల చీడపీడలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువుగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు రావడానికి అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులపైనే మరియు అడుగు భాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటుంది. దీనివలన కిరణసంయోగక్రియ ఆటంకం కలుగుతుంది. తెగులు ఉదృతి ఎక్కువుగా ఉంటే ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీనిని నివారించడానికి ఒక లీటర్ నీటిలో 1 మిల్లిలీటర్ డైనోకప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి.
పొద్దుతిరుగుడు పంటలో ప్రధానంగా కనిపించే వాటిలో రసం పీల్చు పురుగులు కూడా ఒకటి, పంట సమయంలో వీటి ఉదృతి ఎక్కువుగా ఉంటుంది. పురుగు ఆకుల మీద చేరి రసం పీల్చడం వలన ఆకులు గిడసబారిపోయినట్లు కన్పిస్తాయి. వీటిని నివారించకుంటే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని నివారించడానికి థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 8 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఈ పంటలో మరో ప్రధానమైన పురుగుల్లో సెనగపచ్చపురుగు ఒకటి. ఇది మొక్కలు పుష్పించే దశలో పువ్వులు మరియు గింజల మీద చేరి వాటిని తింటూ పంటకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. వీటిని ఉనికిని గుర్తించేందుకు పొలంలో నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చవలసి ఉంటుంది. పురుగుల ఉదృతి ఎక్కువుగా ఉంటే ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు. దీనితోపాటు పైరు ఎదిగే దశలో ఉన్నపుడు పొగాకు లద్దెపురుగు కూడా మొక్కలపై చేరి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వీటిని నివారించడానికి లింగాకర్షక బట్టల్తోపాటు, నొవాల్యూరాన్ 1 మి.లీ ,,మందును ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.
పొద్దుతిరుగుడులో చీడపీడలతోపాటు, పక్షులు కూడా పంటకు హానికలిగిస్తాయి. రామచిలుకలు వంటివి మొక్కలపై చేరి గింజలను తిని మొక్కలను నాశనం చేస్తాయి. వీటితోపాటు కొన్ని అడవిపందుల కూడా పంటకు నష్టం కలిగిస్తాయి. పొలంమీద మెరుపు రిబ్బన్లను కట్టడం ద్వారా పక్షులను కొంతవరకు నివారించవచ్చు. శబ్దాలు చెయ్యడం మరియు దిష్టిబొమ్మలను ఉంచడం ద్వారా పక్షులు మరియు ఇతర వన్యప్రాణులు బెదిరిపోయి పొలంలోకి రాకుండా ఉంటాయి.
Share your comments