హోం గార్డెన్ లో రకరకాల మొక్కలు పెంచుకోవడంతో గార్డెన్ మరింత అందంగా.. ఆకర్షణీయంగా మారుతుంది. అలంకరణ కోసమే కాకుండా గార్డెన్ లో మన ఆరోగ్యాన్ని ఎంతగానో ఉపయోగ పడే మొక్కలు పెంచితే... భలే ఉంటుంది కదా.. ! అలా గార్డెన్ అందంగా మార్చడంతో పాటు మన ఆరోగ్యానికి సహాయపడే మొక్కల్లో కలబంద ఒకటి. ఔషధ మొక్క అయిన కలబంద వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎడారి మొక్క అయిన ఈ కలబంద చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ ఇది అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
దళసరిగా ఉండే కలబంద కాండం, ఆకులు జిగురు లాంటి గుజ్జున కలిగి ఉంటాయి. ఇది నేల స్వభావంతో సంబంధం లేకుండా అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. కుండీల్లోనూ పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. దీని పెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలు, దీని నిర్వాహణ సైతం తేలికగానే ఉంటుంది. కాబట్టి కలబందను పెంచుతూ ఇది అందించే ప్రయోజనాలు పొందవచ్చు. కలబంద మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకోవాల్సి ఉంటుంది.
కలబంద మొక్కలు నాటుకోవడం/పెంచడం
కలబండ మొక్కలను పెంచుకోవడానికి కలబంద తల్లి మొక్క నుంచి వచ్చిన చిన్న చిన్న మొక్కలు లేదా కత్తిరించిన ఆకులను నేలలో లేదా కుండీల్లో నాటుకోవాలి. మొక్కలను నాటే ముందు కుండీలో అయితే సారవంతమైన మట్టిని పోసుకోవాలి. నేల మీద నాటే ముందు తీసిని గొయ్యిలో మొక్కల పెరుగుదలకు అవసరమై తక్కువ మొత్తంలోనే ఎరువులను వేసుకోవాలి. మొక్కలు నాటిన వెంటనే నీరు పోయాలి. కలబంద మొక్కలను జూన్, జులై నెలల్లో నాటుకోవడం వల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం తక్కువగా ఉండటంతో పాటు మొక్కల పెరుగుదలకు ఈ రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కలబంద పెరుగుదల ఏపుగా ఉండాలంటే ఇవి సూర్యరశ్మీ అధికంగా పడే ప్రాంతంలో నాటుకోవడం మంచిది. కుండీల్లో ఇంటిలోపల ఉండే కలబంద మొక్కలు సూర్యరశ్మీ పడే ప్రాంతంలో పెట్టుకోవాలి. కలబంద మొక్కలకు నిత్యం కాకుండా అప్పుడప్పుడు నీరు అందించినా సరిపోతుంది.
Share your comments