రాష్ట్రవ్యాప్తంగా సాగు నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో అధిక విస్తీర్ణంలో వరి సాగును రైతులు చేపడుతున్నారు. ప్రస్తుతం కూలీల కొరత అధికంగా ఉండటంతో వరి పైరులో కలుపు మొక్కలు ప్రధాన సమస్యగా మారింది.
సాధ్యమైనంతవరకు కలుపుమొక్కలను అంతరకృషి ద్వారా తొలగించుకోవడంమే ఉత్తమం.తప్పనిసరి పరిస్థితుల్లో కలుపు నివారణ మందులను వాడాలనుకుంటే మీ దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకుని వాడటం మంచిది.
నారుమడిలో ఊదర ఎక్కువగా ఉంటే ఎకరా నారుమడికి బుటాక్లోర్ లేదా బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేక 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేసుకోవచ్చు.
వరి పైరు నాటిన 3 నుంచి 5 రోజుల వ్యవధిలో
పొలంలో ఊద మొదలైన ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఉదృతి ఉన్నప్పుడు బ్యుటాక్లోర్ 50% 1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 50% 500 మి.లీ.లలో ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నీరు పొలమంతా సమానంగా పెట్టి వెదజల్లాలి. వరినాట్లు వేసిన15 రోజుల తర్వాత ఊదర వంటి గడ్డిజాతి కలుపుమొక్కలున్నప్పుడు సైహలోఫాప్-పి10% మందును ఎకరాకు 400 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు.
వరి పైరులో గడ్డి, తుంగ,ఆకుజాతి కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటే నాటిన 15-20 రోజులకు బిస్రిబాక్ సోడియం10% కలుపు మందును 80-120 మి.లీ. ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.వరినాట్లు వేసిన 25-30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఎక్కువగా ఉంటే ఎకరాకు 400గ్రా. 2, 4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీ. నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపు మొక్కలపై పడేటట్లు పిచికారి చేసుకోవాలి.
Share your comments