నిమ్మ సాగులో వచ్చే ప్రధాన తెగుళ్లలో సిట్రస్ గజ్జి తెగులు ఒకటి. నిమ్మకు ఈ తెగులు సోకితే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. బ్యాక్టిరియాల ద్వారా ఈ తెగులు సంక్రమిస్తుంది. కసన్తోమోనాస్ సిట్రీ అనే రకం బ్యాక్టిరియా వల్ల వస్తుంది. సిట్రస్ గజ్జి తెగులు అన్నిరకాల దశలో ఉన్న మొక్కలకు వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తెగులు మొక్కల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తెగులు కారణంగా మొక్కల ఆకులు, కాయలు, కొమ్మలపై మచ్చలు ఏర్పడతాయి. గోధుమ రంగులో ఉన్న పులుపిరులు మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పెరిగి.. పగిలిపోతాయి. పగిలిన తర్వాత లేత గోధుమ రంగు ఉండి జడ్డు పధార్థంలా కనిపిస్తుంది. దీని కారణంగా ఆకులు రాలిపోతాయి. కాయలు సైతం రాలిపోతాయి. క్రమంగా మొక్కలు క్షీణించిపోతాయి. తెగులు ప్రభావం మరింతగా ముదిరితే మొక్కలు సైతం చనిపోయే ప్రమాదం ఉంటుంది.
నిమ్మలో ‘సిట్రస్ గజ్జి తెగులు’ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సాగు దారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉండవు. నిమ్మపంట సాగు చేసే రైతులు వీలైనంత వరకు తెగులు నివారణ చర్యలను జీవ సంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని అవలంభించాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంటకు గనక ఈ తెగులు సోకితే.. నివారించడం త్వరగా జరగదు కాబట్టి పంట నష్టం భారీగానే ఉంటుంది. అందువల్ల సిట్రస్ గజ్జి తెగులు రాకుండా శీలింధ్ర నాశనులు, బ్యాక్టిరియా నివారణ రసాయన మందులను పచికారీ చేసుకోవాలి. సిల్లిడ్స్ నియంత్రణ కూడా సిట్రస్ గజ్జి తెగులు నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మలో సిట్రస్ గజ్జి తెగులు సోకితే రైతులు తీసుకోవాల్సిన మొదటి చర్యల్లో తెగులు సోకిన మొక్క భాగాలను, కొమ్మలను, కాయలను తొలగించాలి. దీని వల్ల పంట మొత్తం వ్యాపించకుండా ఉంటుంది. దీంతో మొత్తం పంటపై ప్రభావం పడదు. ప్రస్తుతం అనేక తెగుళ్లను తట్టుకునే నిమ్మ రకాలలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నిమ్మ సిట్రస్ గజ్జి తెగులును తట్టుకునే రకాలను నాటుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కల సేకరణ సమయంలోనే సాగు చేసే నేల, అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటే మొక్కలను కొనుగోలు చేయాలి. స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులు, వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా ఉత్తమం. తోటలో రాలిన ఆకులు, కాయలు సహా ఇతర చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. సస్యరక్షణకు ఉపయోగించే పరికరాలు వాడే ముందు కీటక సంహారకాలతో శుభ్రం చేసుకోవాలి.
Share your comments