ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల పంట సాగులో చీడపీడల సమస్య ఉధృతంగా ఉండడంతో మన రైతు సోదరులు చీడపీడల నిర్మూలించడానికి వాడే రసాయన మందుల పైనే అధిక పెట్టుబడులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిని అధిగమించడానికి చక్కటి పరిష్కార మార్గం చూపిస్తున్నారు మన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి. ఈయన సూచనల ప్రకారం తక్కువ శ్రమ ,తక్కువ పెట్టుబడితో చీడపీడల సమస్యను అధిగమించవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రైతు శాస్త్రవేత్త చింతల వెంకట రెడ్డి గారి సూచనల ప్రకారం భూమి లోపలి పోర నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టికి అర లీటరు ఆముదం నూనెను కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వివిధ రకాల కూరగాయ పంటలైన టమాటో, మిరప,బెండ, బీర, వంకాయ మరియు వాణిజ్య పంటలైన పత్తి, వరి, గోధుమ పంటల్లో విత్తిన లేదా నాటిన పది రోజులకు మనం తయారుచేసుకున్న మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు చీడపీడల సమస్య అసలు ఉండటం లేదని వివరించారు.
ప్రతి 20 రోజులకొక సారి మట్టి ఆముదం కలిపిన మిశ్రమాన్ని మొక్కల పాదుల్లో వేయడం వల్ల పంటలకు ఎక్కువగా ఆశించే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆముదం నూనె వాసనకు మొక్కలను ఆశించడం లేదని దాంతో మొక్కల పెరుగుదల బాగా అభివృద్ధి జరిగి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు గమనించాల్సిన విషయం ఏమంటే మట్టి ఆముదపు నూనె కలిపిన మిశ్రమాన్ని మొక్కల పాదులు వేసిన వెంటనే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదు.
అలా వేయడం వల్ల ఆముదపు నూనె ఔషధ గుణం తగ్గి చీడపీడలను ఎదుర్కొనే స్వభావం కోల్పోతుంది.
Share your comments