Agripedia

వంకాయల సాగులో వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు!

KJ Staff
KJ Staff
Brinjal Cultivation
Brinjal Cultivation

వంకాయకూర లేకుండా పెండ్లిళ్లు, పేరంటాలు జరగవంటే అతిశయోక్తి కాదు. అంతలా మన జీవితాలతో ముడివేసుకుంది వంకాయ.  అందుకే వంకాయ సాగులో అనేక ఇబ్బుందులు ఉన్నా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒక్కోసారి రైతులు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే.. పంటలను చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. దిగుబడి తగ్గి రైతులకు ఆదాయాలు రాకపోగా... నష్టాల కూపిలో పడేస్తాయంటున్నారు వ్యవసాయ నిపుణులు. వంకాయలో వచ్చే పలు ప్రధాన తెగుళ్లు, వాటిని నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వంకాయలో వచ్చే ప్రధానమైన తెగుళ్లలో ఆకు మాడు తెగులు ఒకటి. వంకాయ నాటు నాటిన నెల తర్వాత ఆకు మాడు తెగులు సోకే అవకాశాలు ఉంటాయి. ఆకు మాడు తెగులు కారణంగా వంకాయ మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు గోధుమ రంగుతో పాటు లేత పసుపు రంగులో ఉంటాయి. దీని కారణంగా ఆకులు రాలిపోతుంటాయి. మొక్కలు నీరసంగా మారి.. బలహీన పడతాయి. దీంతో పంటపై ప్రభావం పడుతుంది. దీని నివారణకోసం 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు ఒక గ్రామ్ కార్బెండజెమ్ ను లీటరు నీటిలో కలిపి పిచుకారీ చేసుకోవాలి. అలాగే, వంకాయకు కాయకుళ్లు తెగులు కూడా సాధారణంగా సోకేదే. దీని వల్ల కాయలు రంగు మారి రాలిపోతుంటాయి. కాయకుళ్లు తెగులు నివారణకు ఉదయం పూట లీటరు నీటిలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును పిచికారి చేయాలి.

వంకాయలో వచ్చే మరో తెగులు వెర్రితెగులు. వైరస్ ల వల్ల వంకాయకు ఈ తెగులు సోకుంది. దీని వల్ల ఆకులు చిన్నవగానే ఉండిపోతాయి. పూత, కాత రాకుండా ఉంటుంది. మొక్కల పెరుగుదల చూడ్డానికి గుబురుగానే ఉంటుంది.  దీని ప్రధాన నివారణ చర్యల్లో వెర్రి తెగులు సోకిన మొక్కలను తొలగించాలి.  ఇది సోకకుండా నారు నాటే ముందు కొన్ని రసాయనాలు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. వంకాయలో వెర్రితెగులు నివారణ కోసం ఒక లీటరు నీటిలో 2 మిల్లీ లీటర్ల మిథైల్ డెమాటన్ ను పిచికారీ చేసుకోవాలి. మార్కెట్ లోనూ ఈ తెగుళ్లకు అనేక రకాల రసాయన మందులు అందుబాటులో ఉన్నాయి.  వ్యవసాయ నిపుణుల సలహామేరకు వాడుకోవాలి.

Share your comments

Subscribe Magazine